29-07-2025 12:10:54 AM
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజాచిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్.. విజయ్‌కి అన్న పాత్ర పోషిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘ఈరోజు అభిమానుల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నా. మీరు నాకు దేవుడిచ్చిన వరం. సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. అదే ప్రేమ, అదే నమ్మకం నాపై చూపిస్తున్నారు. ఈ రోజు ఫ్యాన్ మీట్ లో దాదాపు రెండు వేల మందిని కలిశాను. అందులో ఎక్కువమంది నాతో చెప్పిన మాట ’అన్నా ఈసారి మనం హిట్ కొడుతున్నాం’. నన్ను మీ వాడిని చేసేసుకున్నారు.
నా విజయాన్ని చూడాలని మీరు కోరుకుంటున్నాను. సినిమా వల్లే మీకు నేను పరిచయం అయ్యాను. మీ కోసం ప్రతి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాను. మీరందరూ నా నుంచి కోరుకుంటున్న హిట్ ‘కింగ్డమ్’తో రాబోతుంది. ఇది విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ కాదు.. గౌతమ్ తిన్ననూరి ‘కింగ్డమ్‘ అన్నారు. కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమ వల్లే నాకు నటిగా ఇన్ని అవకాశాలు వస్తున్నాయి.
ఇలాంటి గొప్ప సినిమాలో విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. గౌతమ్ గారు ఎంతో ప్రతిభగల దర్శకుడు‘ అన్నారు. ప్రముఖ నటుడు సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘సామాన్యుడిలా వచ్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘కింగ్డమ్’ను స్థాపించుకున్న విజయ్ అంటే నాకు అపార గౌరవం. విజయ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే దేవరకొండ కాదు బంగారుకొండ. అనిరుధ్ ఏది పట్టుకుంటే అది బంగారం.
అనిరుధ్ సంగీతం అందించిన సినిమాలో భాగం కావడం గర్వంగా ఉంది. ఎవరైతే కొన్ని సినిమాలు చేయడానికి భయపడతారో.. అలాంటి సినిమాలు నాగవంశీ చేసి హిట్లు కొట్టి, గట్స్ ఉన్న నిర్మాత అనిపించుకున్నారు. భవిష్యత్ లోనూ గౌతమ్ తో సినిమా చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను‘ అన్నారు. ఇంకా ఈ వేడుకలో సంగీత దర్శకుడు అనిరుధ్, నటులు వెంకటేశ్ రంగస్థలం మహేశ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, కళా దర్శకుడు అవినాష్ కొల్లా, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, గీత రచయిత కృష్ణకాంత్ తదితరులు మాట్లాడారు.. ‘కింగ్డమ్’ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.