29-07-2025 12:08:52 AM
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ ఫిల్మ్ తమిళ, -తెలుగు భాషల్లో రూపొందుతోంది. ప్రముఖ నటుడు సముద్రఖని కీలక పాత్ర పోషిస్తుండగా, దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు.
దుల్కర్ సల్మాన్ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాతలు సోమవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచింది. ట్రైలర్‌ను పరిశీలిస్తే.. ఉద్ధండులైన ఇద్దరు సినీప్రముఖుల జర్నీగా ఈ చిత్రాన్ని మలిచినట్టు తెలుస్తోంది. ఇందులో దుల్కర్ పాత్రను వెర్సటైల్ యాక్టర్ ‘చంద్రన్’గా, సముద్రఖని పాత్రను వెటరన్ రైటర్- డైరెక్టర్ ‘అయ్య’గా పరిచయం చేశారు.
కెరీర్ ఆరంభంలో ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయత.. క్రమంగా పేరు, ప్రఖ్యాతి వచ్చేకొద్దీ చీలిపోయే తీరు ఆకట్టుకునేలా ఉంది. అయ్య తన తొలి హార్రర్ చిత్రం ‘శాంత’ను శక్తిమంతమైన కథానాయిక చుట్టూ రూపొందిస్తుంటే.. క్రమంగా ఆ ప్రాజెక్ట్‌ను తన చేతుల్లోకి తీసుకుంటాడు చంద్రన్. తర్వాత స్క్రిప్ట్‌ను తన ఇమేజ్‌కు అనుగుణంగా మార్చి, టైటిల్‌ను కూడా ‘కాంత’గా మార్చేస్తాడు.
1950ల్లో మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ బలమైన భావోద్వేగాలతో కట్టిపడేసింది. ‘ఏంటీ నట చక్రవర్తీ.. కథ ఆరంభమే అబ్బురపరిచేలా ఉందే?!’ అని సముద్రఖని చెప్పడం.. ‘అంతా మీ దగ్గరే నేర్చుకున్నది కదా!!’ అని దుల్కర్ డైలాగ్స్ పేలాయి. సెప్టెంబర్ 12న థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం: ఝను చంతర్; డీవోపీ: డాని శాంచెజ్ లోపెజ్; ఆర్ట్: తా. రామలింగం; ఎడిటర్: లెవెల్లిన్ ఆంథోనీ గోన్సాల్వేస్; కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ, అర్చనరావు, హర్మాన్ కౌర్.
‘ఆకాశంలో ఒక తార’ గ్లింప్స్
వైవిధ్యమైన, సరికొత్త పాత్రలతో మెప్పిస్తున్నారు దుల్కర్ సల్మాన్. ఈ విలక్షణత కారణంగానే ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆయన ఇప్పుడు యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేనితో చేతులు కలిపారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఆ సినిమాయే ‘ఆకాశంలో ఒక తార’. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు ఈ సందర్భంగా మేకర్స్ సోమవారం ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్ సున్నితమైన భావోద్వేగాలతో హృదయాన్ని హత్తుకుంటూ ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. మన సాధారణ జీవితంలో కనిపించే క్షణాలను ఇందులో అందంగా చూపించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను ముందుకు రానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్; సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్; ప్రొడక్షన్ డిజైనర్: శ్వేత సాబు సిరిల్; నిర్మాతలు: సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం; కథారచన: గంగరాజు గుణ్ణం; దర్శకత్వం: పవన్ సాధినేని.