27-01-2026 06:26:19 PM
అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వచ్చే నెల ఫిబ్రవరి 25 తేదీ నుంచి మార్చి 16వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఛాంబర్ లో అదనపు ఎస్పీ డి.చంద్రయ్య తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ప్రశ్నపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇతరులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాల్లో ఉండరాదని, గుర్తింపు పొందిన వారిని తప్ప ఎవరినీ అనుమతించరాదని ఆదేశించారు.వేసవి దృష్ట్యా వైద్య శాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ లను నియమించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట మహిళా పోలీస్ సిబ్బందికి డ్యూటీ కేటాయించాలని సూచించారు. కేంద్రాల్లో పరీక్ష రాసే వారికి అన్ని వసతులు కల్పించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శరత్ కుమార్, వైద్య ఆరోగ్య, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ, పోస్టల్, ఇంటర్మీడియట్ విద్య, ఆర్టీసీ సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.