27-01-2026 06:22:57 PM
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవర్
మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో డయేరియా కేసులు పూర్తిగా నివారించే వరకు ఆరోగ్య శిబిరం నిర్వహించాలని, ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. జడ్పీ సిఈఓ శిరీష, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వెంకటరమణ, తహసీల్దార్ వెంకన్న, ఎంపిడిఓ ఆంజనేయులు, మెడికల్ అధికారి భవాని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మిలతో కలెక్టర్ ఛాంబర్ నుండి టెలికాన్ఫిరెన్స్ నిర్వహించారు.
వైద్య ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ రాజ్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది,పారా మెడికల్ సిబ్బంది 24x7 విధుల్లో ఉండాలని ఆదేశించారు. వ్యాధుల వ్యాప్తిని అడ్డుకునేందుకు స్వచ్ఛమైన త్రాగు నీటి వినియోగం, పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత అలాగే ముందస్తు నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
గత గురువారం రోజున సిరికొండ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి విరోచనాలతో బాధపడటంతో ఆశ కార్యకర్త గుర్తించి మెరుగైన చికిత్స కొరకు మోతె ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి చికిత్స అందించటం జరిగింది. గత 3 రోజులలో 50 మందికి చికిత్సను అందించటం జరిగినదని, వీరంతా మిరప తోటలో పనికి వెళ్ళి అక్కడ కలుషితమైన నీటిని త్రాగుట వలన అస్వస్థతకు గురైన విషయం తెలుసుకోవడంతో నీటి నమూనాలను పరీక్షల కొరకు పంపించటం జరిగినదని, అధికారులు కలెక్టర్ కి వివరించారు. అధికారులు, గ్రామస్తులు సమన్వయం చేసుకుంటూ అస్వస్థకు గురైన ప్రజలు త్వరగా కోలుకునేలా చూడాలని కలెక్టర్ కోరారు.