calender_icon.png 28 December, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిమడ్ల గ్రామంలో చిరుత కలకలం...

28-12-2025 01:09:32 PM

గొర్రెల మందపై దాడి...

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని మరిమడ్ల గ్రామంలో చిరుతపులి హల్చల్ చేసింది. శనివారం అర్ధరాత్రి సమయంలో గ్రామ శివార్లలో ఉన్న ఒక గొర్రెల మందపై చిరుత దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే... మరిమడ్ల గ్రామ పరిసరాల్లో గొర్రెల కాపరులు తమ మందను భద్రపరుచుకున్న క్రమంలో, ఆకస్మికంగా వచ్చిన చిరుత మందపై దాడి చేసింది. ఈ దాడిలో ఒక మేకను తీవ్రంగా గాయపరిచగా మరో మేకను అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. గొర్రెల కాపరులు అప్రమత్తమై కేకలు వేయడంతో చిరుత ఆ ప్రాంతం నుండి పారిపోయింది.

ఈ ఘటనపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అయిఫ్ ఖాన్ స్పందిస్తూ.. మరిమడ్లలో గొర్రెల మందపై జరిగింది చిరుత దాడేనని ప్రాథమికంగా ధృవీకరించారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామం కావడంతో వన్యప్రాణులు గ్రామ పొలిమేరల్లోకి వచ్చే అవకాశం ఉందని, ప్రజలు ముఖ్యంగా గొర్రెల కాపరులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చిరుత దాడితో మరిమడ్ల గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతను పట్టుకోవడానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకొన్నారు.