calender_icon.png 17 May, 2025 | 8:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూ సంఘటిత శక్తిని చాటేలా.. హిందూ ఏక్తా యాత్ర

17-05-2025 12:38:31 AM

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

కరీంనగర్, మే 16 (విజయ క్రాంతి): కరీంనగర్ లో ఈనెల 22న నిర్వహించబోయే “హిందూ ఏక్తా యాత్ర” తెలంగాణలో ఓ సంచలనం కాబోతోందని కేంద్ర  హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇంఛార్జీలు, ముఖ్య నాయకులు, మహిళా మోర్చా నాయకులతో ‘హిందూ ఏక్తా యాత్ర’ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల సంఘటిత శక్తి చాటేలా.....దేశద్రోహుల వెన్నులో వణుకు పుట్టేలా.... సంతూష్టీకరణ పేరుతో ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మధ్య విబేధాలు స్రుష్టిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే నాయకుల చెంప చెళ్లుమనేలా “హిందూ ఏక్తా యాత్ర”ను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తామన్నారు. “హిందూ ఏక్తా యాత్ర రాజకీయ కార్యక్రమం కానేకాదని, ఇది ఒక పార్టీకి సంబంధించినది కాదన్నారు.

హిందూ శక్తిని ప్రదర్శించే యాత్ర మాత్రమేనని, బొట్టు పెట్టుకునే ప్రతి ఒక్కరిదని అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామం నుండి మండల కేంద్రాలదాకా,  మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ దాకా గడప గడప నుండి హిందువులంతా యాత్రకు తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ నాయకులంతా ఇంటింటికీ వెళ్లి ఈనెల 22న కరీంనగర్ లో నిర్వహించబోయే ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలిరావాలంటూ ఆహ్వానించాలని బండి సంజయ్ కుమార్ కోరారు.

తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం సిద్దించిందని, ఇక మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు నడవవని, ఇప్పుడు జాతీయవాదులను, హిందువులందరినీ ఏకం చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు. పెహెల్ గాం ఘటనతో ఏం జరిగిందో అందరం చూశ్రమని ప్రతి ఒక్క హిందువు ఆ ఘటనను చూసి రగలిపోయారన్నారు.  ఉగ్రవాదులతోపాటు పాకిస్తాన్ అంతు చూడాలని కోరుకున్నారనీ, ఆ తరువాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసని, ఇప్పుడు హిందువులందరినీ ఏకం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

హిందూ ఏక్తా యాత్ర ద్వారా హిందువులందరికీ సంఘటితం చేసే మహత్తర అవకాశం వచ్చిందని, ఈనెల 22న కరీంనగర్ లో నిర్వహించబోయే ‘హిందూ ఏక్తా యాత్ర’ ద్వారా ఈ అవకాశం మనందరికీ వచ్చిందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లండి, హిందూ ఏక్తా యాత్రకు ఆహ్వానించండి,  అసలు ఏక్తా యాత్ర ఉద్దేశమేమిటి? హిందువులంతా ఐక్యంగా ఉండకపోతే ఏం జరిగే ప్రమాదముందో తెలియజేయాలని, యువతను, మహిళలను, విద్యార్థులను, కుల సంఘాలను, ప్రజా సంఘాలను, వ్రుత్తి సంఘాలను ఏకం చేయాలని అన్నారు.

లక్ష మందికి తగ్గకుండా ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్ రావు, చెన్నమనేని వికాస్ రావు, గుగ్గిళ్ల రమేశ్, ఓదేలు, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.