17-05-2025 12:38:58 AM
17,162 మెగావాట్లకు చేరుకున్న విద్యుత్ డిమాండ్
గతేడాదితో పోలిస్తే 9.8 శాతం అధికం
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): ఫ్యూచర్ సీటీలో విద్యుత్ టవర్లు, పోల్స్, లైన్స్ బహిరంగంగా కనిపించడానికి వీల్లేదని, పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. హైటెన్షన్ లైన్లను కూడా అక్కడి నుంచి తరలించాలని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి శుక్రవారం విద్యుత్‌శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్క ర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, టీజీ రెడ్కో ఎండీ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, శాటిలైట్ టౌన్‌షిప్‌లకు కావాల్సిన విద్యుత్ అవసరాలపై హెచ్‌ఎండీఏతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
క్షేత్రస్థాయిలో విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్లను అప్‌గ్రేడ్ చేసుకోలని చెప్పారు. విద్యుత్ లేన్ల ఆధునీకరణపైనా దృష్టి సారించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్మార్ట్ పోల్స్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా జీహెఎంసీ పరిధిలోని పుట్‌పాత్‌లు, నాలా ల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులతో సీఎం పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరి గిందని, అది 17,162 మెగావాట్లకు చేరుకుందని, భవిష్యత్తు అంచనాలు, అవసరాలకు తగట్టుగా మరింత విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్రానికి వెల్లువెత్తిన పె ట్టుబడులు, రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబోయే పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తు ప్రణాళికను తయారు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
పరిశ్రమలతో పాటు గ్లోబల్ కెపాబులిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, మాస్‌ట్రాన్స్‌పోర్టేషన్ (మెట్రో, ఎలక్ట్రికల్ వెహికల్స్) దృష్టిలో ఉంచుకొని పునరుత్పాదక విద్యుత్‌పై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను ముందస్తుగా అంచనా వేసి అందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
సెక్రటేరియెట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్కు వంటి ప్రాంతాల్లో స్మార్ట్ పోల్స్‌ను తీసుకోరావాలని, 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్, ఫుట్‌పాత్, నాలాల వెంట సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం కావాల్సిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. రాష్ర్టంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వల్ల వచ్చే మూడేండ్లలో విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అధికారులను అప్రమత్తం చేశారు.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మూడేండ్ల విద్యుత్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ‘గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8 శాతం పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఇది గొప్ప విజయమే అయినప్పటికీ అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో రాష్ట్రప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది’ అని పేర్కొన్నారు.
ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని, 2025-26లో 18,138 మెగావాట్లు, 2034-35 నాటికి 31,808 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని భవిష్యత్తు అవసరాలు, అంచనాలను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి నివేదించారు.
విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలి..
పెరుగుతున్న విద్యుత్ అంచనాలకు సరిపడేలా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రధానంగా క్లీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్‌పైన దృష్టి సారించాలన్నారు. ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీపైనా దృష్టి సారించాలని చెప్పారు.
విద్యుత్ ఉత్పత్తిలో ప్రఖ్యాతిగాంచిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మించే నీటి పారుదల ప్రాజెక్టుల విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని, మెట్రో విస్తరణ, రైల్వే లైన్లు, ఇతర మాస్ ట్రాన్స్‌పోర్టుల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల విద్యుత్ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని, కొత్తగా ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్లు, పారిశ్రామికవాడలకు కావాల్సిన విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారు.
నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కల్తీ దందాను అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాల వారీగా వ్యవసాయ శాఖ, పోలీస్ విభాగం సంయుక్తంగా టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించాలని, రాష్ర్ట సరిహద్దుల్లో అన్ని చోట్ల టాస్క్‌ఫోర్స్ నిఘా ఉంచాలని చెప్పారు.
సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వానాకాలం పంటల సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, వ్యవ సాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇప్పటికే అన్ని జిల్లాల్లో సరిపడే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సీజన్‌లో వరి, పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంటుందని, రైతుల నుంచి డిమాండ్ ఉన్న అన్ని కంపెనీల విత్తనాలు మార్కెట్లో ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులను మోసం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఎవరినీ ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. నకిలీ దందా చేసే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసులు పెట్టాలన్నారు. వానాకాలం సాగుకు రైతులు సన్న ద్ధంగా ఉండాలని సూచించారు.
ఎరువులు, విత్తనాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు భరోసానిచ్చారు. ఈసారి రుతుపవనాలు ముందే వస్తుండటంతో, రాష్ర్టంలో నూ వానలు ముందుగానే కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన సూచన లను రైతులు గమనించాలన్నారు. అందుకు అనుకూలంగా సరైన అదనులో పంటలు వేసుకోవాలని, నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులను అప్రమత్తం చేశారు.