17-05-2025 12:34:26 AM
ఏర్పాట్లు పరిశీలించిన విప్, కలెక్టర్, ఎస్పీ
జగిత్యాల, మే 16 (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండల కేంద్రంలో శనివారం భూ భారతి రెవెన్యూ సదస్సుల పైలట్ ప్రాజెక్టుగా జరుగనున్న కార్యక్రమానికి మంత్రి హాజరు కానున్నారు.
కాగా సదరు కార్యక్రమ ఏర్పాట్లను ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కార్యక్రమం జరగనున్న బుగ్గారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ శుక్రవారం రాత్రే మంత్రి పొంగులేటి జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లతో మంత్రి సమీక్ష జరుపుతారన్నారు.
సంబంధిత జిల్లాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, భూ భారతి సదస్సుల నిర్వహణపై సమీక్ష జరుగుతుందని అడ్లూరి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, ఆయా మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.