04-08-2025 01:43:15 AM
-బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి
-కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్మూడు రోజులపాటు కార్యక్రమాలు
-రాజధానికి భారీగా హస్తం పార్టీ శ్రేణులు ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన టీ పీసీసీ
-5న పార్లమెంట్ వాయిదా తీర్మానం
-6న జంతర మంతర్ వద్ద ధర్నా 7న రాష్ట్రపతిని కలవనున్న నేతలు
-బీసీ బిల్లును ఆమోదించాలని వినతి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లుతోంది. మూడు రోజుల పాటు హస్తిన వేదికగా నిర్వహించే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. జంతర్‌మంతర్ వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రం నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
ప్రతి జిల్లా నుంచి కనీసం 25 మందికి ఉండాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సూచించారు. 5వ తేదీన పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, ఎన్డీయేతర పార్టీలతో వాయిదా తీర్మానం ఇప్పించనున్నారు. ఇక 6వ తేదీన 2 వేలకు పైగా జనంతో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేయనున్నారు.
ఇక 6న చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇతర నాయకులు కూడా హాజరుకానున్నారు. రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షినటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నేతలు కూడా హాజరుకానున్నారు.
నేడు చర్లపల్లి నంచి ప్రత్యేక రైలు..
బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ 6వ తేదీన చేపట్టే ధర్నాకు పార్టీ శ్రేణుల, బీసీ సంఘాల నాయకులను తరలించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు సోమవారం ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరనుంది. 5వ తేదీన ఉదయం ప్రత్యేక రైలు ఢిల్లీకి చేరనుంది. ఢిల్లీలో పార్టీ శ్రేణులు, నాయకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ధర్నా తర్వాత మరుసటి రోజు అంటే 7వ తేదీ సాయంత్రం అదే రైలు తిరుగు ప్రయాణం అవుతుంది. ఢిల్లీకి వచ్చే వారు ఆధార్‌కార్డులను తప్పనిసరిగా తీసుకురావాలని పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్ సూచించారు.
రాహుల్.. అభినవ ఫూలే అంటూ ఫ్లెక్సీలు
జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ధర్నాకు సంబంధించి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టింది. ఢిల్లీలోని ప్రధాన కూడళ్లలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు నేతృత్వంలో ‘అభినవ ఫూల్ రాహుల్‌గాంధీ’ అంటూ ఫ్లెక్సీలను ఏ ర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్ర భ వన్, ఏఐసీసీ కార్యాలయంతో పాటు జంతర్ మంతర్ వద్ద ఫెక్సీలు ఏర్పా టు చేయడంతో బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశానికి మరింత ప్రచారం జరుగుతుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు.