04-08-2025 01:40:50 AM
- మన ఆలోచన తీరు మారితేనే మార్పు సాధ్యం
- ఐ మిషన్ ‘మైత్రి వారధి’లో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మన చుట్టూ ఉండే సమాజం బాగుంటేనే మనం బాగుంటామని, సమాజంలో మార్పు రావాలంటే మన ఆలోచ న తీరు మారాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం ఐ మిషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ మినీ శిల్పారామంలో నిర్వహించిన ‘మైత్రి వారధి’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మనం నడక నేర్చింది మొదలు చివరిశ్వాస వరకూ మనకోసం పరుగులు పెడుతూనే ఉన్నామని, ఈ ప్రయాణంలో సమాజం గురించి పట్టించుకొనే తీరిక ఉండటం లేదని అభిప్రాయపడ్డారు. సమాజమంటే కేవలం నలుగురు మనుషులు కాదని, మనచుట్టూ ఉండే మను షులు అని ప్రతిఒక్కరూ గుర్తించాల్సిన అవసరముందన్నారు. మనలో చాలా మంది సమాజం కోసం ఏదో చేయాలని అనుకుంటారని, కానీ నా ఒక్కడి వల్ల ఏమవుతుందిలే అనుకుంటూ వెనుకడుగు వేస్తుంటారని.. అదే మన అతిపెద్ద బలహీనత అని అన్నారు.
నిజానికి ఒంటరిగా ఏం సాధించలేమని, అదే సమష్టిగా అడుగు ముందుకేస్తే మార్పు సాధ్యమవుతుందన్నారు. యువత తలుచుకుంటే అసాధ్యమంటూ ఏదీ లేదని తెలిపారు. వారు తమ శక్తిని వెలికితీసి, దాన్ని సమాజం కోసం వినియోగిస్తే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు. ఆ దిశగా అడుగు వేయాలని యువతకు సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వానికి యువశక్తి తోడైతే శక్తిమంతమైన, ఆదర్శవంతమైన తెలంగాణ నిర్మితమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
యువత కలలు నిజమయ్యేలా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీరు ముందుకు నడవండి.. కొత్త ఆలోచనలకు పదును పెట్టండి.. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని సూచించారు. సమాజం కోసం ఐ పాటుపడుతున్న తీరు ప్రశంసనీయమని కొనియాడారు. భవిష్యత్‌లోనూ ఈ స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో ఓ పత్రిక ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, ఐ మిషన్ నిర్వాహకులు వాసుదేవశర్మ తదితరులు పాల్గొన్నారు.