09-08-2024 12:00:00 AM
ముప్పుయేళ్ల అలుపెరగని పోరాటం లక్ష్యం చేరింది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయడంతో అంతిమంగా ధర్మం గెలిచింది. వెలివాడల నుండి మాదిగ దండును కదిలించి, ఉదయిస్తున్న సూర్యుడిపై చిటికెన పుల్లతో దరువేయించిన ఎమ్మార్పీఎస్ రథసారథి మంద కృష్ణమాదిగ కార్యసాధకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. సామాజిక, విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అత్యంత వెనుకబడిన మాదిగ, ఉపకులాలను ఆ రోజుల్లో ఉద్యమం వైపునకు మళ్లించడం అంత సులువైన అంశం కాదు. అలాంటిది మూడు దశాబ్దాలపాటు చెక్కు చెదరకుండా, నిటారుగా నిలబడి సామాజిక ఉద్యమం నడపడం వెనుక కఠోర శ్రమ, త్యాగాలు, అవమానాలు ఎదుర్కొన్న ఎన్నో దృశ్యాలున్నాయి. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ చెప్పిన ‘బోధించు, సమీకరించు, పోరాడు’ అనే పిలుపును కృష్ణమాదిగ పకడ్బందీగా అమలు పరచి పద్మవ్యూహాన్ని చాకచక్యంగా ఛేదించారు.
తిరుగుబాటు అనివార్యం
అణచివేత ఉన్నచోట తిరుగుబాటు అనివార్యమవుతుంది. స్వస్థలం వరంగల్‌లో ఆధిపత్య స్వభావం కలిగిన వర్గం నుండి తొలిసారి భౌతికదాడిని ఎదుర్కొన్న మంద కృష్ణ ఆత్మరక్షణలో భాగంగా ప్రతి దాడికి దిగారు. అణచివేత తీవ్రమైన సమయంలో విప్లవోద్యమం బాట పట్టారు. అనంతరం ప్రజా జీవితంలోకి వచ్చి సామాజిక ఉద్యమాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత సత్యమూర్తితో సాన్నిహిత్యం ఏర్పడింది.
ఈ క్రమంలోనే ఎస్సీల్లో ఉమ్మడి రిజర్వేషన్ల అమలు వల్ల మాదిగ, ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని గ్రహించారు. జనాభా ప్రాతిపదికన సమన్యాయం జరగాలంటే ఎస్సీలను ఏ,బీ,సీ,డీ గ్రూప్‌లుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో అవిభజిత ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మారుమూల గ్రామం ఈదుముడి నుండి 13 మంది మాదిగ యువకులతో కలిసి ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) పురుడు పోశారు. అప్పటి నుండి తన గుండెలపై అన్యాయానికి నిరసనగా ఆయన ‘నల్ల కండువా’ను మోస్తున్నారు.
చాపకింద నీరులా విస్తరణ
ఒక మారుమూల గ్రామం నుండి అతి తక్కువమంది సాధారణ యువకులతో ప్రారంభమైన ఎమ్మార్పీఎస్ గురించి ప్రస్తుతం దేశమంతా మాట్లాడుకుంటున్నది. ఇతర కులసంఘాలు దండోరా పోరాట పటిమను ప్రశంసిస్తున్నాయి. ఒకనాడు ‘మాదిగ’ అనే పేరు చెప్పుకోవడా నికి ఆత్మన్యూనతకు లోనైన జాతి.. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం అనంతరం పేరు చివరన పెట్టుకొని ఆత్మగౌరవ బావుటాను ఎగరేసి నూతన సంప్రదాయానికి నాంది పలికింది. రాజకీయ పార్టీలతో సమానంగా ప్రస్తుతం ఊరూరా దండోరా విస్తరించింది. ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మె లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. మాదిగలది న్యాయబద్ధమైన పోరాటం. అందుకే, ఉద్యమానికి సమాజం నుండి సంపూర్ణ సహకారం లభించింది.
విభిన్న రూపాల్లో పోరాటం
ఎస్సీ జాబితాలోని 59 కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల వాటాను పంచాలన్న ఏకైక నినాదంతో ముందుకు సాగిన ఎమ్మార్పీఎస్ విభిన్న రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిం చింది. రాజకీయంగా ఒత్తిడిని పెంచింది. 1995 మే 1న ఒంగోలులో 70 వేల మందితో ప్రథమ సమావేశం జరిగింది. 1996 మార్చి 2న హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్‌లో లక్షలమందితో బహిరంగ సభ నిర్వహించారు. అదే నెల 25న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం చెంత ఎమ్మార్పీఎస్ సమావేశం నిర్వహించగా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయం గా హాజరయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను చేపడతామని హామీ ఇచ్చా రు.
ఎమ్మార్పీఎస్ ఒత్తిడి అనంతరం టీడీపీ ప్రభుత్వం జస్టిస్ సి. రామచంద్ర రాజు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. సమస్య తీవ్రతను తెలిపేందుకు చంద్రబాబు స్వగ్రామం నారా వారిపల్లె నుండి హైదరాబాద్ వరకు ‘లాంగ్ మార్చ్’ పేరిట ఎమ్మార్పీఎస్ లక్షలాది మందితో మహా పాదయాత్ర చేపట్టింది. ఈలోగా రామచంద్ర రాజు కమిషన్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎస్సీలను నాలుగు గ్రూపులుగా విభజించి, 15 శాతం రిజర్వేషన్లను జనాభా నిష్పత్తి ప్రకారం వర్తింపజేసింది.
అయితే, పలు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రాష్ట్రస్థాయిలో వర్గీకరణను హైకోర్టు రద్దు చేసింది. అనంతరం తీవ్రరూపం దాల్చిన నిరసనల మూలంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో 1999లో రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఆమోద ముద్రతో తిరిగి ‘ఏ, బీ, సీ, డీ ’ వర్గీకరణ ఆకాంక్ష నెరవేరింది. ఫలితంగా, 2004 నవంబర్ వరకు ఐదేండ్లలో మాదిగ, ఉపకులాలు సుమారు 23 వేల ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ప్రగతి బాటలో అడుగుపెట్టారు. అయితే, ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలువ లేదు.
ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉమ్మడి రిజర్వేషన్లతో అత్యధిక లబ్ధి పొందిన సోదర వర్గం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, రాష్ట్ర పరిధిలో వర్గీకరణ అంశం లేదనే సాంకేతిక కారణంతో సుప్రీంకోర్టు వర్గీకరణకు బ్రేక్ వేసింది. పిడుగు లాంటి సమాచారం చెవికి చేరినా ఎమ్మార్పీఎస్ ఆత్మ స్థయిర్యం కోల్పోలేదు. మళ్లీ చైతన్యయాత్ర, ధర్మయుద్ధ మహా పాదయాత్ర, కురుక్షేత్ర మహాసభ, విశ్వరూప మహాసభ నిర్వహించి బలమైన ఆకాంక్షను చాటింది. అసెంబ్లీ, గాంధీభవన్ ముట్టడి వంటి సందర్భాల్లో పలువురు అమరులు కావడం ఒక విషాదం. వేల సం ఖ్యలో పోలీసు కేసులు, జైలు జీవితం బాధాకరం. కానీ, న్యాయబద్ధమైన కోరిక సాధన కోసం వెన్నుచూపని ‘ఉద్యమ సైన్యం’ నిర్మాణం కావడం స్ఫూర్తిదాయకం.
ఉద్యమాలకు దిక్సూచి
ఉపవర్గీకరణ సాధన ఉద్యమంతోపాటు సమాజంలోని బాధిత వర్గాలకు ఎమ్మార్పీఎస్ నిరంతరం అం డగా నిలబడింది. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్‌ను స్ఫూ ర్తిగా తీసుకొని డోలు దెబ్బ, చాకిరేవు దెబ్బ, తుడుం దెబ్బ, లంబాడ హక్కుల సమితి వంటి పలు హక్కుల సంఘాలు పుట్టుకొచ్చాయి. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్న చిన్నారుల పక్షాన మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో ప్రత్యేకంగా పోరాటం జరిగింది.
ఆ పోరాట ఫలితంగానే తమ ప్రభుత్వం ‘ఆరోగ్య శ్రీ’ పథకానికి రూపకల్పన చేసిందని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం గమనార్హం. మలి తెలంగాణ ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించింది. వృద్ధులు, వికలాం గులు, వితంతు పింఛన్ల పెంపు కోసం కృషి చేసింది. ఈ విషయాన్ని ఇటీవల జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా గుర్తు చేయడం తెలిసిందే.
వ్యూహం ఫలించింది
ఉద్యమాన్ని సన్నాహక దశనుండి అంత్యదశకు చేర్చడంలో మంద కృష్ణమాదిగ వ్యూహం అత్యద్భుతం. విమర్శలు, ఆరోపణలు, రాజకీయ వేధింపులకు ఎప్పు డూ బెదరలేదు. పదవులకు లొంగలేదు. ఎలాంటి సమాచార వ్యవస్థలు అందుబాటు లేని సమయంలో కేవలం కరపత్రాల పంపిణీతో నిర్మాణం ప్రారంభించి, అసౌకర్యాలను తట్టుకొని నిలబడడం ఆయన అంకితభావానికి నిదర్శనం. ఎమ్మార్పీఎస్ సభకు ఏకంగా దేశ ప్రధాని మోడీని తీసుకొచ్చి, బహిరంగ హామీని ఇప్పించుకునే స్థాయిలో ఉద్యమం తీర్చిదిద్దారు.
వర్గీకరణ అంశం రాజకీయ సహకారంతో ముడిపడి ఉంది. ఎన్నికల సంద ర్భంలో జాతి ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయా లు తీసుకొని సఫలీకృతులయ్యారు. బలమైన ఎమ్మార్పీఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు పాలకులు పన్ని న కుట్రలు ప్రతిసారి విఫలమయ్యాయి. మొక్కవోని ధైర్యంతో కృష్ణమాదిగ ముందుకు సాగారు. ఆఖరికి సర్వోన్నత న్యాయ స్థానం ఎస్సీ ఉప వర్గీకరణకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణను అమలు పర్చాలి. మాదిగల గుండెలో ‘మంద’ స్థానం పదిలం. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రయోజనాల కోసం ఉమ్మడి పోరాటాలకు సిద్ధవుతున్న కృష్ణమాదిగకు మరోమారు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది.
నరేష్ పాపట్ల
వ్యాసకర్త సెల్ : 9505475431