calender_icon.png 1 November, 2025 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిజిటల్ అరెస్ట్ పేరుతో టోకరా

31-10-2025 12:14:01 AM

రిటైర్డ్ ఉద్యోగిని ఇంటిలోనే బంధించి రూ.51 లక్షల స్వాహా

సీబీఐ, ముంబై పోలీసులమంటూ బెదిరింపులు  

ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా గంటల తరబడి వీడియో కాల్‌లోనే నిర్బంధం 

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 30 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాలో అమాయకులను దోచుకుంటున్నారు. తాజాగా ‘డిజిటల్ అరెస్ట్’ అనే పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగిని ఇంట్లోనే వీడియో కాల్‌లో బంధించి, రూ.51 లక్షలు కొల్లగొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే.. నగరంలోని ఓ వృద్ధుడికి కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాము టెలికామ్ సంస్థ ప్రతినిధులమని, మీ పేరు మీద ఉన్న ఫోన్ నంబర్‌ని అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారని నమ్మబలికారు. ఆ తర్వాత ఫోన్‌ని ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు కలుపుతున్నామని చెప్పి, మరో వ్యక్తికి లైన్ ఇచ్చారు. అవతలి వ్యక్తి తాను పోలీస్ అధికారినని, మీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని బెదిరించాడు.

విషయం సీరియస్‌గా ఉందని, సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తారని భయపెట్టి, స్కైప్ వీడియో కాల్‌లో మాట్లాడాలని సూచించారు. వారి మాటలు నమ్మిన వృద్ధుడు స్కైప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని లాగిన్ అయ్యాడు. వీడియో కాల్‌లో అవతలి వైపు పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తులు, సీబీఐ కార్యాలయం వంటి సెటప్‌తో నమ్మించారు. మనీలాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని, విచారణ పూర్తయ్యేవరకు ఎవరితోనూ మాట్లాడకూడదని, ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని హుకుం జారీ చేశారు.

దీనినే ‘డిజిటల్ అరెస్ట్’ అని నమ్మించారు. కేసు నుంచి బయటపడాలంటే మీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును ప్రభుత్వ రిజర్వ్ ఖాతాలకు బదిలీ చేయాలని, విచారణ తర్వాత తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలికారు. వారి ఒత్తిడి, బెదిరింపులకు భయపడిపోయిన బాధితుడు, వారు చెప్పిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా ఏకంగా రూ.51 లక్షలు బదిలీ చేశాడు. డబ్బు మొత్తం బదిలీ అయ్యాక సైబర్ నేరగాళ్లు కాల్ కట్ చేసి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు.

మోసపోయానని గ్రహించిన బాధితుడు చివరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పోలీసులు ఎప్పుడూ ఫోన్లలో, స్కైప్ కాల్స్‌లో  విచారణలు, అరెస్టులు చేయరని, డబ్బులు బదిలీ చేయమని అస్సలు అడగరని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానం వస్తే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు.