01-11-2025 04:24:32 PM
- ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
- హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ మండలం హన్మాజీపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంచార్జి కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీ హెచ్ సీ లో సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని పరిశీలించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై రోగుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. గర్భిణీలు అందరూ ప్రభుత్వ దవాఖానల్లో పేర్లు నమోదు చేసుకునేలా చూడాలని, ఇక్కడ అందుతున్న సేవలు, వసతులపై అవగాహన కల్పించాలని నిరంతరం పరీక్షలు చేసి వైద్యం అందించాలని సూచించారు. సర్కార్ దవాఖానల్లోనే ప్రసవాలు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించి, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై ఆసుపత్రికి వచ్చే వారికి వివరించాలని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి వేములవాడ మండలం హన్మాజీపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, సిబ్బంది రిజిస్టర్లు తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యా బోధనను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యాలయం ఆవరణ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.