calender_icon.png 17 September, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కఠినంగా గ్రూప్-2 ప్రశ్నలు

16-12-2024 01:10:54 AM

  1. మొదటి రోజు ముగిసిన పేపర్-1, 2
  2. 46.30 శాతం మంది హాజరు
  3. వికారాబాద్‌లో సెల్‌ఫోన్‌తో దొరికిన అభ్యర్థి
  4. నేడు పేపర్ 3, 4 పరీక్షలు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, డిసెంబర్ 15: గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన రెండు పేపర్లలోనూ ప్రశ్నలు కఠినంగానే ఉ న్నాయని, జవాబులు గుర్తించడం కష్టంగా మారిందని పలువురు అభ్యర్థులు పేర్కొన్నా రు. పేపర్ 1 కంటే పేపర్ 2 కాస్త తేలికగా ఉం దని చెప్పారు.

మొత్తం 783 గ్రూప్--2 పోస్టు ల భర్తీకి 5,51,855 మంది అభ్యర్థుల కోసం టీజీపీఎస్సీ రాష్ర్టవ్యాప్తంగా 1,368 కేంద్రా లు ఏర్పాటు చేసింది. ఆదివారం నిర్వహించిన పేపర్-1 పరీక్షకు 2,57,981 (46.75 శాతం) మంది, పేపర్-2కు 2,55,490 (46.30 శాతం) మంది హాజరయ్యారు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరీశిలించారు.

పేపర్-1లో రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై, సినీరంగం, అంతర్జాతీయ అంశాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, రీజనింగ్‌పై ప్రశ్నలు రాగా, పేపర్-2లో నిజాం నవాబుల కాలం, జోగినీ వ్యవస్థ, సికింద్రాబాద్ ఉజ్జయినీ ఆల యం, జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ డబ్ల్యూఎస్ కమిటీలు, రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్.. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ అధికారా లు, తెలంగాణ జిల్లాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అధికారాలపై ప్రశ్నలు అడిగినట్టు అభ్య ర్థులు తెలిపారు. సోమవారం పేపర్ 4 పరీక్షలు నిర్వ హించనున్నారు.

నిమిషం ఆలస్యంతో వెనక్కి

గ్రూప్--2 పరీక్షకు ఒక్క నిమిషం నిబంధన ఉండటంతో అభ్యర్థుల కొంప ముంచింది. చాలా జిల్లాల్లో అభ్యర్థులు ఆలస్యంగా కేంద్రాలకు వెళ్లడంతో సిబ్బంది అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా రావడంతో 16 మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.

జనగామ జిల్లాలో ఓ బాలింత అరగంట ముం దే పరీక్ష కేంద్రానికి చేరుకున్నా పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయారు. జనగామ పట్టణంలో పక్కపక్కనే రెండు పరీక్ష కేంద్రాలు ఉండటంతో పొరపాటున అరగంట ముందే మరో సెంటర్‌కు వెళ్లింది. ఇన్విజిలేటర్ ఓఎంఆర్ ఇచ్చే సమయంలో పక్క సెంటర్ అని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లింది.

కానీ అప్పటికే అర్ధగంట సమయం గడిచిపోయింది. అధికారులు ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడంతో కేంద్రం వద్దే విలపించింది. జనగామ క్రీస్తు జ్యోతి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రానికి ఆలస్యంగా వచ్చి న ఐదుగురు అభ్యర్థులు పరీక్ష రాయకుండా వెనుదిరిగారు. వరంగల్‌లో ముగ్గురు అభ్యర్థులను అధికారులు అనుమతించలేదు.

భూపాలపల్లిలో 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థిని లోనికి అనుమతించలేదు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 19 మంది, ములుగులో ఇద్దరు అభ్యర్థులను అనుమతించ లేదు. సంగారెడ్డిలో 15 మంది ఆలస్యంగా రావడంతో పరీక్ష రాయలేకపోయారు. 

లోదుస్తుల్లో సెల్‌ఫోన్

వికారాబాద్‌లోని శ్రీ సాయి డెంటల్ కళాశాలలో మధ్యాహ్నం 2 గంటలకు రెండో పేపర్ రాసేందుకు అభ్యర్థులందరు లోపలికి వెళ్లారు. ఓ అభ్యర్థి సెల్‌ఫోన్‌ను లోదుస్తుల్లో దాచుకుని లోపలికి వెళ్లిపోయాడు. పరీక్ష ప్రారంభమయ్యాక అతని తీరుపై ఇన్విజిలేటర్‌కు అనుమానం రావడంతో తనిఖీ చేయగా సెల్‌ఫోన్ ఉన్నట్టు గుర్తించారు. వెంటనే అతన్ని అక్కడ ఉన్న పోలీసులకు అప్పగించారు.

కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి సెంటర్‌కు వెళ్లి అభ్యర్థిని విచారించారు. ఉదయం జరిగిన పరీక్షకు కూడా సెల్‌ఫోన్ లోపలికి తీసుకొచ్చాడా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సదరు అభ్యర్థిని రాత్రి 9:30 గంటల తర్వాత కూడా ఎస్పీ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. ఈ విషయమై టీజీపీఎస్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

సెల్‌ఫోన్లు, బ్యాగుల డిపాజిట్‌కు రూ.100

సంగారెడ్డి జిల్లా ఎంఎన్‌ఆర్ మెడికల్ కళాశాలలో పరీక్ష కేంద్రంను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థుల సెల్‌ఫోన్‌లు, బ్యాగులు డిపాజిట్ చేసుకునేందుకు గేట్ వద్ద ఉన్న సిబ్బంది ఒక్కరి వద్ద రూ.50 నుంచి రూ.100 వసూలు చేయడంతో అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

స్పందించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌కు ఆదేశాలు జారీచేశారు. అదనపు కలెక్టర్ కళాశాలకు చేరుకుని వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.