07-10-2025 12:54:46 AM
-దసరా సెలవులు ముగియడంతో నగరానికి తిరుగు ప్రయాణాలు
-టోల్‌గేట్ల వద్ద కి.మీ.ల మేర నిలిచిన వాహనాలు
-నగరంలో ప్రయాణికులతో కిటకిటలాడిన మెట్రో స్టేషన్లు
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబరు 6 (విజయక్రాంతి): దసరా పండుగ సెలవులు ముగియడంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు లక్షలాదిగా హైదరాబాద్‌కు తిరుగుపయణమయ్యారు. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాలు రద్దీగా మారాయి. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు ప్రయాణికులతో నిండిపోయాయి. దీంతో ప్యారడైజ్, బేగంపేట నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే రహదారులపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
రోడ్లపై ట్రాఫిక్ జామ్‌లను తప్పించుకుందామని మెట్రో రైళ్లను ఆశ్రయించిన ప్రయాణికులకు అక్కడ కూడా చుక్కెదురైంది. విజయవాడ, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల వైపు నుంచి వచ్చే ప్రయాణికులతో ఎల్బీనగర్, ఉప్పల్, నాగోల్ మెట్రో స్టేషన్లు కిక్కిరిశాయి. టికెట్ల కోసం, రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పొడవైన క్యూలో నిలబడాల్సి వచ్చింది. అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్ వంటి ఇంటర్‌చేంజ్ స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఎన్‌హెచ్‌పై భారీగా ట్రాఫిక్ జామ్
చిట్యాల (విజయక్రాంతి): దసరా సెలవు లు ముగించుకొని నగర బాట పట్టిన ప్రజల వాహనాలతో ఆదివారం నుంచి హైదరాబాద్ వైపు ఉన్న రోడ్లు రద్దీగా మారాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ జాతీయ రహదారి 65పై నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతోపాటు హైవేపై ఓ లారీ పంక్చర్ కావడంతో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు స్తంభించిపోయాయి.