07-10-2025 12:54:44 AM
జగిత్యాల అర్బన్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బెస్ట్ అవలెబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా ఎంపికై వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను ఫీజు బకాయిలు చెల్లించలేదని స్కూ ల్ యజమాన్యాలు బయటకు పంపించడంతో విద్యార్థులు,వారి తల్లిదండ్రులు నిరసన చేపట్టారు.
ప్రభుత్వం నుంచి తమకు రావలసిన ఫీజు బకాయిలు చెల్లించలేదని జగిత్యాల లోని శ్రీ చైతన్య పాఠశాల, జాబితాపూర్, అక్షర స్కూల్ రాజారంపల్లి, వాగ్దేవి స్కూల్ మల్యాల, వాసవి స్కూల్ నాచుపల్లి, చుక్క రామయ్య స్పేస్ స్కూల్ ల యాజమాన్యాలు సోమవారం విద్యార్థులను బయటకు పంపించి వేశారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు సంబంధిత అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఎస్సీ వెల్ఫేర్ కార్యాలయంకు వెళ్లగా సిబ్బంది వినతి పత్రాన్ని తీసుకోవడానికి తిరస్కరించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలతో కలిసి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి లోని ప్రొఫెసర్ జయశంకర్ కూడలి వద్ద బైఠాయించి నిరసనకు వ్యక్తం చేశారు. ఎర్రటి ఎండలోనే చిన్న పిల్లలతో రోడ్డుపై కూర్చొని తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద ప్రభుత్వం ఎంపిక చేసి 2022 సంవత్సరంలో తమ పిల్లలను పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలకు పంపించారని తెలిపారు.
ఈ స్కీం కింద పిల్లల చదువుతోపాటు పుస్తకాలు, దుస్తులు ఉచితంగా ఇస్తారని తెలిపితే తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చేర్పించామని తెలిపారు. అయితే ప్రభుత్వం తమ పిల్లలకు సంబంధించిన ఫీజులు ఇతర బకాయిలు పాఠశాల యాజమాన్యాలకు చెల్లించడం లేదని తెలుపడంతో గత మూడు సంవత్సరాలుగా పుస్తకాలు, దుస్తులు తామే కొనుగోలు చేస్తున్నామని వాపోయారు.
ఇప్పుడు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని తమ పిల్లలను అర్ధాంతరంగా బయటకు పంపడంతో తమ పిల్లల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు చెల్లించలేదని సాకుతో తమ పిల్లలను ఇతర విద్యార్థులతో కాకుండా పక్కన కూర్చోబెట్టడం వల్ల పసి పిల్లలు మానసిక వేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎంపికైన విద్యార్థుల ఫీజు బకాయిలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. విద్యార్థుల ధర్నాతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగడంతో ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేష్ చేరుకొని వారిని సముదాయించి ధర్నావిరమింపచేశారు.