12-12-2025 10:05:22 PM
చిట్యాల,(విజయక్రాంతి): డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు కొట్టుకు పోవడం శుక్రవారం కలకలం రేపింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో గ్రామంలో మొదటి విడతలో భాగంగా స్థానిక ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందగా మరుసటి రోజు అయిన శుక్రవారం డ్రైనేజీలో వందలాది బ్యాలెట్ పత్రాలు కొట్టుకుపోవడం కలకలం రేపింది. ఈ పత్రాలపై బీఆర్ఎస్ బలపర్చిన కత్తెర గుర్తుకు ఓటు వేసినట్లు ముద్రించి ఉండడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గురువారం వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి 455 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో, ఈ ఘటనపై పరాజయం పాలైన బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి రుద్రారపు భిక్షం రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సందర్శించారు. డ్రైనేజీలో కొట్టుకుపోతున్న బ్యాలెట్ పత్రాలను ఘటన స్థలానికి వచ్చి స్వయంగా వీక్షించారు. వివిధ గ్రామాలలో బిఆర్ఎస్ గెలిచే ప్రతి చోట రెగ్గింగ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నాయకులు ఈ దారుణానికి ఒడిగట్టారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు కుమ్మక్కై రిగ్గింగ్ కు పాల్పడ్డారని, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్న అన్నిచోట్లా ఇలాంటి సంఘటనలే జరిగాయని వారు ఆరోపించారు.