12-12-2025 10:43:49 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్,(విజయక్రాంతి): రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మరోసారి పిఓ లకు తమ ఎన్నికల విధులపై కీలక సమాచారం అందించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రానికి సమయానికి చేరుకోవడంతో మొదలుకొని, ఎన్నికల సామాగ్రి స్వీకరణ, పోలింగ్ కేంద్రాలకు చేరుకొనుట, పోలింగ్ నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక, తదితర అంశాలపై అధికారులతో మాట్లాడారు.
వారికి కీలక సూచనలు చేశారు. మొదటి విడత ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని, అధికారులందరూ అదే స్ఫూర్తితో పనిచేసి రెండో విడత ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. నిర్మల్ (గ్రామీణం), సారంగాపూర్, సోన్, దిలావర్పూర్, నర్సాపూర్ (జి), కుంటాల, లోకేశ్వరం ఆరు మండలాల్లో రెండో దశ ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు చెప్పారు. ఆన్ లైన్ విధానంలో మండలాల నుంచి ఈ సమావేశంలో పాల్గొన్న తహసిల్దార్లు, ఎంపీడీవోలు, జోనల్ ఆఫీసర్ల ను మండలాల వారిగా ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డీఈవో భోజన్న, జడ్పి సిఈఓ శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.