25-10-2025 05:46:46 PM
మోర్తాడ్ (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం మోర్తాడ్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ఐసిడిఎస్ సూపర్వైజర్ లకు బాల్య వివాహం నిరోధక చట్టంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ అధికారి చైతన్యకుమార్ శిక్షణ ఇవ్వడం జరిగింది శిక్షణలో భాగంగా 2006లో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిందని ఈ చట్టం ప్రకారం బాలుడికి వయసు 21 సంవత్సరాలు బాలికకు వయసు 18 సంవత్సరాలు నిండకుండా వివాహం జరిగితే అది ఈ చట్టం ప్రకారం నేరం అవుతుంది.. బాల్య వివాహం చేసుకుంటే ఈ చట్టం కింద రెండు సంవత్సరముల జైలు శిక్ష లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండు శిక్షలను విధించవచ్చు.. ఇది బెయిల్ లభించని నేరం బాల్య వివాహం జరిపిన బాల్యవివాహాన్ని ప్రోత్సహించిన గాని ఇదే రకమైన శిక్షలు విధించబడతాయని తెలిపారు.
2006 బాల్య వివాహ నిరోధక చట్టం 16వ సెక్షన్ ప్రకారం ప్రభుత్వం బాల్యవివాహాల నిషేధ అధికారులను నియమించడం జరిగిందని బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి అధికారాలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. బాల్య వివాహ నిరోధక అధికారులుగా గ్రామస్థాయిలో పంచాయతీ సెక్రెటరీ మండల స్థాయిలో తహసిల్దార్, సూపర్వైజర్ (ఐసిడిఎస్), ప్రాజెక్ట్ స్థాయిలో సిడిపివోలు డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ ఉంటారని, బాల్య వివాహం జరుగుచున్నచో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేయాలని ఈ సందర్భంగా కోరారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి స్థానిక తహసిల్దార్ చిలుకలు కృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహం వల్ల సామాజికంగా ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఎదుగుదల తగ్గిపోయి అన్ని రకాల అభివృద్ధికి నోచుకోరని బాల్యవివాల వల్ల తల్లి బిడ్డలు ఇద్దరికీ ప్రమాదకరమని చిన్న వయసులో గర్భం దాల్చడం వల్ల మాతా శిశు మరణాలు పెరుగుతాయని తెలిపారు పౌషికాహార లోపం రక్తహీనత వంటి అనారోగ్య కారణాలు పిల్లలలో తలెత్తుతాయని తెలిపారు బాల్యవివాహాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో తిరుమల, సూపర్వైజర్ ఐసిడిఎస్ మంజుల,కౌన్సిలర్ జమ్రుద్, మోర్తాడ్ మండల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.