25-09-2025 12:00:00 AM
జిల్లాలో 316 మందికి క్రమబద్దీకరణ
మంచిర్యాల, సెప్టెంబర్ 24 (విజయక్రాం తి) : సింగరేణి కోల్ కెమికల్ కంపెనీ లిమిటెడ్ సంస్థలోని భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ గనులు, సర్ఫేస్ లో బదిలీ వర్కర్లుగా పని చేస్తున్న కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు అందించింది. 2024 డిసెంబర్ 31 నాటికి సింగరేణిలో కంపెనీ సూచించిన మస్టర్లు పూర్తి చేసిన బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి - 1గా క్రమబ ద్ధీకరిస్తూ సింగరేణి సీ అండ్ ఎండీ బలరాం నాయక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు.
దీనితో సింగరేణి వ్యాప్తంగా 1,258 మం ది సింగరేణి బదిలీ వర్కర్లు నేటి నుంచి జనరల్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించను న్నారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ నాయకులు క్రమబద్ధీకరణపై సింగ రేణి సీఎండీ ఎన్ బలరామ్ నాయక్, డైరెక్టర్ (పర్సనల్) గౌతమ్ పొట్రులతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 316 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్దీకరిస్తూ శ్రీ రాంపూర్, మంద మర్రి, బెల్లంపల్లి ఏరియాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
శ్రీరాంపూర్ ఏరియాలో 241 మందికి, మందమర్రిలో 64 మందికి, బెల్లంపల్లి ఏరియాలో 11 మంది బదిలీ వర్కర్లను జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించనున్నారు. అలాగే రామగుండం-2 ఏరియాలో 303 మందికి, భూపాలపల్లి ఏరియాలో 250 మందికి, రామగుండం-3 అం డ్ అడ్రియాల ఏరియాలలో 167 మందికి, రామగుండం-1 లో 156 మందికి, కార్పోరేట్‌లో 21 మందికి, కొత్తగూడెం ఏరియాలో 20 మందికి, మణు గూరు ఏరియాలో 19 మందికి, ఇల్లందు ఏరియాలో ఆరుగురికి జనరల్ అసిస్టెంట్ కేటగిరి-1గా క్రమబద్ధీకరించే ఉత్తర్వులు జారీ చేయనున్నారు.