ఆడపిల్లైతే అంతమేనా?
భూమిపైకి రాకముందే రక్తపు ముద్దగా... మురుగు కాలువల్లో
కొరవడిన అధికారుల నిఘా
భ్రూణ హత్యలపై అధికారుల చర్యలేవి?
హాస్పిటల్‌లపై నామ మాత్రపు తనిఖీలు
తప్పు చేసిన ఓ ఆసుపత్రిని కాపాడుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధి!
మిర్యాలగూడ జూలై 2: మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా.. రాజ్యాలు ఏలుతున్నా.... అంతరిక్షంలో అడుగీడుతున్నా.. ఇప్పటికీ ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతుంది. మిర్యాలగూడ ప్రాంతంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమంగా గర్భస్త్రావాలు నిర్వహిస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ చేసి, ఆడశిశువు అని తెలిసిన తర్వాత అబార్షన్లు చేస్తున్నారనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
గర్భంలో ఉన్న శిశువు లింగాన్ని తెలుసుకొని ఆడపిల్ల అని తెలిసిన వెంటనే గర్భస్రావం చేయించడం సమాజాన్ని కలిసి వేసే అమానుష చర్య. గర్భంలోని శిశువు లింగ నిర్ధారణ చేయడం ఆ సమాచారాన్ని వెల్లడించడం దాని ఆధారంగా గర్భస్రావం చేయడం నేరం అయినప్పటికీ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లు డబ్బు కోసం రహస్యంగా ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం:
మిర్యాలగూడ పట్టణంలో భ్రూణ హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఓ దం పతులు ఆడపిల్ల అని తెలుసుకొని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో అబార్షన్ చేయించుకోవడం కొరకు వెళ్లారు. ఈ అబార్షన్ ను అధికారులు అడ్డుకున్నారు. కానీ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్న హాస్పటల్ పై చర్యలు తీసుకోకుండా షోకాజ్ నోటీసులు మాత్రమే ఇవ్వడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్పత్రిలో విస్తృత తనిఖీలు చేశారు. ఈ ఆస్పత్రి పై వస్తున్న ఆరోపణలు పక్కదోవ పట్టించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈ హాస్పిటల్ నిర్వాహకుడికి అధికార పార్టీ బడా ప్రజా ప్రతిని ధి అండగా నిలుస్తున్నట్లు పట్టణంలో చర్చ జోరుగా కొనసాగుతుంది. ఈ తంతు నిత్య కృత్యమైన సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా నల్లగొండ వైద్య ఆరోగ్యశాఖ అధికారిని భ్రూణ హత్యలపై చర్యలు ఏమి తీసుకుంతున్నారని వివరణ కోసం ఫోన్ లో ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.






