calender_icon.png 22 July, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలకు మేం సిద్ధం

22-07-2025 01:23:11 AM

- త్వరలోనే నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు 

- కాంగ్రెస్ మోసాలను ఎండగడుతాం

- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, జులై 21 (విజయక్రాంతి): త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, త్వరలోనే నియోజకవర్గాల వారీగా ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండా లని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు తమ జిల్లాల్లోని ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ర్ట కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని కేటీఆర్ ఆదేశించారు.

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలు, వైఫల్యాలను గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచా రం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతుబంధు ఇవ్వకుండా అన్నదాతలకు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని, యూరియా, విత్తనాల కొరత తీవ్రంగా వేధిస్తున్నా.. పట్టింపు లేని ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి సాగునీటి నుంచి విద్యుత్ సరఫరా దాకా అన్నదాతలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని, రేవంత్ ప్రభుత్వ చేతకానితనాన్ని ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్ల విషయమై ప్రజాక్షేత్రంలో ప్రశ్నించాలని పేర్కొన్నారు.

కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్‌కు స్పందన

- పేద వైద్య విద్యార్థినికి ఆర్థిక సాయం

హైదరాబాద్, జూలై 21(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ఓ పేద వైద్య విద్యార్థినికి ఆర్థిక సాయం అం దింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం, వెంకటాపూర్‌కు చెందిన సుస్మిత హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన సుస్మిత తన చదువు కోసం ఆర్థిక సాయం చేయాలని ఎక్స్ ద్వారా కేటీఆర్‌ను కోరింది.

కేటీఆర్ ఆమెకు హామీ ఇచ్చారు. తన జన్మదినం సందర్భంగా ఆయ న అభిమానులు నిర్వహించే గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం స్ఫూర్తితో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ పాఠకోటి ఆయన భార్య డాక్టర్ ప్రణయ వాణి, సుస్మిత చదువుకయ్యే పూర్తి ఖర్చున భరిస్తామని ప్రకటించారు. సోమవారం రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. దుబ్బాక మండలం రాజక్కపేటకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ ప్రస్తుతం ముషీరాబాద్ కేర్ హాస్పిటల్, నాచారంలోని శ్రీ పూజా హాస్పిటల్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సుస్మిత కేటీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య దంపతులను కేటీఆర్ అభినందించి, శాలువాతో సన్మానించారు.