calender_icon.png 7 May, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదివాసీ హక్కులను కాపాడాలి

04-05-2025 12:40:42 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలైట్లతో చర్చలు జరిపి శాంతిని నెలకొల్పాలి 

ఆదివాసీ హక్కుల పోరాట సమితి

ఖైరతాబాద్ మే 3 (విజయక్రాంతి) : కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేసి నర్సలైట్లతో చర్చలు జరిపి ఆదివాసీ హక్కులను కాపాడాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈమేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుర్బ పోచయ్య, రాష్ట్ర అధ్యక్షులు కోట్నాక విజయ్, ప్రధాన కార్యదర్శి సిద్దబోయిన లక్ష్మీనారాయణలు మాట్లాడారు. ఏప్రిల్ 12 నుంచి 14వరకు ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో జరిగిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) డిక్లరేషన్ ను చదివి వినిపించారు.

దేశవ్యాప్తంగా, రాష్ట్రాల వారీగా ఆదివాసీల జీవన ప్రాంతాలల్లో ‘ఆపరేషన్ కగార్‘  అల్లకల్లోలం సృష్టించి ఆదివాసీలను అడవుల నుంచి పంపించే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. చత్తీస్ఘడ్, బస్తర్ లాంటి ప్రాంతాల్లో ఆదివాసీలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ జీవిస్తు న్నారని అన్నారు. కావున మావోయిస్టులు ప్రతిపాదించిన శాంతి చర్చలకు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు స్పందించి వారితో చర్చలు జరిపి అడువుల్లో ప్రశాంత వాతావరణం కల్పించేలా కృషి చేయాలన్నారు.

అలాగే ఎస్టీ రిజర్వేషన్లు ఆదివాసీలకు అందకుండా చేస్తున్న లంబాడీ, బంజారా, నుగారి, గోరు మాటీలను ఎస్టీ జాబితాలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.  రాజ్యాంగం అదివాసీలకు కేటాయించి ప్రత్యేక షెడ్యూల్, అధికరణాల ప్రకారం 29 జీవోను చట్టం చేయాలన్నారు.  2006 ఆటవీ హక్కుల చట్టాని అమలు చేసి ఆదివాసీలకు ఆటవీహక్కుల శాశ్వత పట్టాలు ఇవ్వాలని ఆదివాసీల అసైన్డ్, లవాణీ పట్టాలను శాశ్వతపట్టాలుగా మార్చాలన్నారు.

అంతేకాకుండా ఆదివాసీ వ్యాపార సంస్థ జిసిసికి ప్రత్యేక నిధులు కేటాయించి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే ఆదివాసీ ప్రాంతాలల్లో గిరిజనేతరులను అక్రమ వసలదారు లుగానే పరిగణించి వారికి స్థిర, చర ఆస్తులను ఎటువంటి హక్కులను కల్పించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం సాగుబోయిన పాపారావు, ఆరెం అరుణ్ కుమార్, కల్తీ వెంకన్న, గౌరివేణి ప్రవీణ్ కుమార్, గౌడెం గణేష్, గొగ్గల్ల కోటయ్య, ఎస్.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.