calender_icon.png 7 May, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ అభివృద్ధికి సహకరించండి!

07-05-2025 01:30:59 AM

  1. సరిపడా సౌర పంపుసెట్లను కేటాయించాలి
  2. ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి కోరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): పునరుత్పాదక ఇంధన రంగంలో రాణిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సౌర పంపు సెట్లను భారీగా కేటాయించాలని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కోరారు.

తెలంగాణలో వ్యవసాయరంగానికి నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా  పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసేందుకుగానూ మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఆయన మూడు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.

దేశంలోనే అత్యంత వేగంగా పురోగమిస్తూ, అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సహాయ, సహకారాలు అందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ముందే నిర్ణయించిన విధంగా పీఎం కుసుం కంపోనెంట్ ఏ కింద 500 కేవీ నుంచి 2 ఎంవీల సామర్థ్యం కలిగిన మొత్తం 4 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను కేటాయించాలని కోరారు. 

పీఎం కుసుం కంపోనెంట్ బీ కింద లక్ష సౌర పంపు సెట్లను స్థాపించాలని కోరారు. రాష్ర్ట వాటా నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రికి వివరించారు. గిరిజనుల సాగు భూముల్లో విద్యుత్ లైన్ల స్థాపనకు అటవీ చట్టాలు ఆటంకంగా ఉన్నాయని, కేంద్రం సహకరించాలన్నారు.

పీఎం కుసుం కంపోనెంట్ సీ కింద 2 లక్షల పంపుసెట్లను కేటాయించాలని కోరారు. ఇప్పటికే రాష్ర్టంలో 28 వ్యవసాయరంగ సాగునీటి అవసరాల కోసం లక్షల పంపు సెట్లు వినియోగంలో ఉన్నందున సంప్రదాయ విద్యుత్ రంగంపై భారాన్ని నివారించేందుకుగాను వీటి అవసరాన్ని కేంద్రమంత్రికి వివరించారు.