22-09-2025 01:36:50 AM
తెలంగాణకు ప్రత్యామ్నాయం బీజేపీయే
ప్రధాని మోదీ నాయకత్వంలోనే రాష్ర్టం అభివృద్ధి
కుటుంబ, అవినీతి పాలనకు చరమగీతం పాడతాం
తెలంగాణ ఆకాంక్షలను బీఆర్‌ఎస్ నీరుగార్చింది
ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ప్రధాని మోదీ నాయకత్వమే దేశానికి శ్రీరామరక్ష
డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి
బీసీలకు నిజమైన న్యాయం చేసేది బీజేపీ మాత్రమే
రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం
విజయక్రాంతి ఇంటర్వ్యూలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ భవిష్యత్తును ఎలా అంచనా వేస్తున్నారు?
ప్రజలు ఆయనను, ఆయన కు టుంబాన్ని పూర్తిగా తిరస్కరించారు. వారి నియంతృత్వ, అహంకారపూరిత రాజకీయాలకు కాలం చెల్లింది. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి, వైద్య వృత్తి నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ రాష్ర్ట స మితి ప్రస్తుత బీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యు ల్లో ఒకరిగా, భువనగిరి పార్లమెంట్‌కు ఎం పీగా పనిచేసిన ఆయన, అనంతర కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఆకర్షితులై బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘విజ యక్రాంతి’ ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. రాష్ర్ట రాజకీయాలు, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వైఫల్యాలు, బీజేపీ భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక అంశాలపై తన అభిప్రా యాలను పంచుకున్నారు.
బీజేపీ రాష్ర్ట ఉపాధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపట్టారు. ఎలా అనిపిస్తోంది? మీ ముందున్న తక్షణ కర్తవ్యాలు ఏమిటి?
చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మ కం ఉంచి గురుతర బాధ్యతను అప్పగించిన జాతీయ, రాష్ర్ట నాయకత్వానికి నాహృదయపూర్వక కృతజ్ఞతలు. నా ముందున్న తక్ష ణ కర్తవ్యం క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం. కేంద్ర ప్రభుత్వ పథకాలను, ప్రధాని మోదీ దార్శనికతను ప్రతిగడపకూ తీసుకెళ్లి, రానున్న ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయ డమే నా ప్రధాన లక్ష్యం.
తెలంగాణ ఉద్యమంలో పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్‌ను వీడి, జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరడానికి బలమైన కారణం ఏమిటి?
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆకాంక్షలతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కా నీ, పదేళ్ల కేసీఆర్ పాలనలో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతింది, రాష్ర్టం అప్పుల ఊబిలో కూరుకు పో యింది. కుటుంబ పాలన, అవినీతి, నియంతృత్వం పెట్రేగిపోయాయి. ఏ లక్ష్యం కోసమై తే పోరాడామో, అది పక్కదారి పట్టినప్పుడు, ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోక తప్పలే దు. ప్రధాని మోదీ సబ్ కా సాథ్, సబ్ కా వి కాస్ నినాదం నన్ను బీజేపీ వైపు నడిపించింది.
టీఆర్‌ఎస్‌లో మీకు సముచిత గౌరవం లభించలేదనే అసంతృప్తితోనే పార్టీ వీడారని అంటారు. నిజమేనా?
వ్యక్తిగత గౌరవాల కన్నా తెలంగాణ ప్రజ ల ప్రయోజనాలే నాకు ముఖ్యం. టీఆర్‌ఎస్‌లో ప్రజాస్వామ్యం లేదు, అది ఒక కుటుం బ కంపెనీలా మారింది. అక్కడ ప్రజల గొం తుకకు, నాయకుల సూచనలకు విలువ లే దు. ఆత్మగౌరవం లేని చోట పనిచేయడం నా వల్ల కాలేదు. ఇది నా ఒ క్కడి సమస్య కా దు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి న అనే క మంది నాయకుల వ్యధ.
గత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో మీ ఓటమికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు విపరీతంగా ధన ప్రవాహాన్ని సృష్టించాయి. దీనికి తోడు, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓటు పూర్తిగా బీజేపీ వైపు మళ్లకుండా, కొంత భా గం కాంగ్రెస్ వైపు కూడా వెళ్లింది. ఈ ఓట్ల చీలిక ప్రత్యర్థికి లాభం చేకూర్చింది. నేను ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన ఎయిమ్స్ వంటి పనుల గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం వల్ల అక్కడ 5 శాతం ఉన్న బీజేపీ ఓటు బ్యాంక్ 30 పెరిగింది. అయినప్పటికీ, ప్రజల తీర్పును శిరసావహిస్తా. ఈ ఓటమిని ఒక పాఠంగా తీసుకొని, భవిష్యత్తులో మరింత కష్టపడి పనిచేస్తా.
డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది బీజేపీ నినాదం. తెలంగాణకు ఇది ఏ విధంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు?
ఖచ్చితంగా మేలు చేస్తుంది. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో బలమైన ప్రభుత్వం ఉంది. రాష్ర్టంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే, కేంద్రం నుంచి నిధులు, పథకాలు వేగంగా రాష్ట్రాన్ని చేరతాయి. అభివృద్ధి పరుగులు పెడుతుంది. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల మధ్య సమన్వయంతో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది.
తెలంగాణలో బీజేపీకి బలమైన క్షేత్రస్థాయి క్యాడర్ లేదనే విమర్శ ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తారు?
ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రధాని మోదీ పాలన, మా పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై లక్షలాది మంది యువత, మేధావులు బీజేపీలో చేరుతున్నారు. మేము బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణలో తిరుగులేని శక్తిగా మారుతుంది.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అతిపెద్ద వైఫల్యంగా దేన్ని పరిగణిస్తారు?
నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోవడం, రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేయడం వారి అతిపెద్ద వైఫల్యాలు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ధరణి పోర్టల్‌తో లక్షలాది మంది రైతుల జీవితాలతో ఆడుకున్నారు. వారి పాపాల జాబితా చాలా పెద్దది.
మీరు బీసీ సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడు. బీసీలకు బీజేపీ ఏ విధమైన భరోసా ఇస్తుంది?
దేశ చరిత్రలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది బీజేపీ ప్రభుత్వమే. ప్రధాని మోదీ బీసీ. కేంద్ర క్యాబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశాం. బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాం. తెలంగాణలో బీజేపీ అధి కారంలోకి వస్తే, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తాం. బీసీల సమగ్రాభివృద్ధే మా లక్ష్యం.
వృత్తిరీత్యా మీరు ఒక వైద్యుడు. రాష్ర్టంలో వైద్యారోగ్య రంగం పరిస్థితిపై మీ అభిప్రాయం?
రాష్ర్టంలో ప్రభుత్వ వైద్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగా ర్చారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షలా మారింది. కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొస్తే, దాన్ని కూడా సరిగా అమలు చేయలేదు. మేం అధికారంలోకి వస్తే ప్రతి పౌరుడికి నాణ్యమైన, ఉచిత వైద్యాన్ని అందించడమే మా ప్రథమ కర్తవ్యం.
తెలంగాణ రైతాంగం అనేక సమస్యలతో సతమతమవుతోంది. వారికి బీజేపీ ఇచ్చే భరోసా ఏమిటి?
కేంద్రంలో మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఫసల్ బీమా యో జనతో పంట నష్టపోయిన వారిని ఆదుకుంటోంది. రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి తే, రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు, విత్తనాలు అందిస్తాం. పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం.
రాష్ర్ట విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి.
మీ సమాధానం?
ఇది పూర్తిగా అవాస్తవం. విభజన చట్టంలోని అనేక హామీలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. జాతీయ రహదారులు, విద్యాసంస్థలు, ఇతర ప్రాజెక్టుల రూపంలో లక్షల కోట్ల రూపాయలను తెలంగాణకు ఇచ్చింది. రాష్ర్ట ప్రభుత్వాల అసమ ర్థతను కప్పిపుచ్చుకోవడానికే కేంద్రంపై నిందలు వేస్తున్నారు.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పనితీరును ఎలా సమీక్షిస్తారు?
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మా ఓటు శాతం గణనీయంగా పెరిగింది. ఇది తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారనడానికి నిదర్శనం. ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని, అసెంబ్లీ ఎన్నికలకు మరింత పకడ్బం దీగా పనిచేస్తాం.
ఒక మాజీ ఎంపీగా, మీ నియోజకవర్గమైన భువనగిరి అభివృద్ధికి మీ ప్రణాళికలు ఏమిటి?
నేను ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశా. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయం, జాతీయ రహదారులు వంటివి నా కృషితోనే సాధ్యమయ్యాయి. భవిష్యత్తులో కూడా భువనగిరి తో పాటు యావత్ తెలంగాణ అభివృద్ధికి నా వంతు పాత్ర పోషిస్తా.
రాష్ర్ట బీజేపీలో సీనియర్ నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య సమన్వయ లోపం ఉందని అంటారు. నిజమేనా?
అస్సలు నిజం కాదు. బీజేపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఇక్కడ అందరం కార్యకర్తలమే. సీనియర్ల అనుభవాన్ని, కొత్తగా చేరిన వారి ఉత్సాహాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా అందరి లక్ష్యం ఒక్కటే - తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడం.
బీజేపీని ఇప్పటికీ కొందరు ఉత్తరాది పార్టీగా, మతతత్వ పార్టీగా చూస్తున్నారు.
ఈ అభిప్రాయాన్ని ఎలా తొలగిస్తారు?
ఇది ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ర్పచారం మాత్రమే. బీజేపీ అందరి పార్టీ. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ అనేది మా సిద్ధాంతం. ఏ పథకమైనా కులం, మతం చూసి ఇస్తున్నామా? ఉచిత రేషన్, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భారత్ వంటివి అందరికీ వర్తిస్తాయి. అభివృద్ధికి మతం రంగు పులమడం మా విధానం కాదు.
రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎలా విశ్లేషిస్తారు?
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని నెలలైనా, వారి పాలనలో స్పష్టత లేదు. ఆరు గ్యారెంటీలు అంటూ ఆర్భాటంగా అధికారంలోకి వచ్చారు, కానీ వాటి అమలులో పూర్తిగా విఫలమయ్యారు. రైతులకు భరోసా లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవు. బీఆర్‌ఎస్ పాలనలోని అవినీతిపై చర్యలు శూన్యం. ఇది కేవలం అధికార మార్పి డే తప్ప, ప్రజల తలరాత మార్చే పాలన కాదు.
తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?
నాయకత్వ సమస్య పార్టీకి ఇబ్బందిగా మారదా?
బీజేపీ ఒక క్యాడర్ ఆధారిత పార్టీ. మాకు సమర్థులైన నాయకులకు కొదవలేదు. సరైన సమయంలో మా పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుంది. మాకు నాయకత్వ సమస్య లేదు, మా నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన ముఖచిత్రంతోనే ఎన్నికలకు వెళ్తాం.
రిజర్వేషన్లపై బీజేపీ వైఖరి ఏమిటి?
రిజర్వేషన్ల విషయంలో బీజేపీ వైఖరి చా లా స్పష్టంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్లను కొనసాగిస్తాం. వాటిని ఎ ట్టి పరిస్థితుల్లోనూ తొలగించం. ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నది కేవలం విష ప్రచారమే.
తెలంగాణ యువతకు మీరిచ్చే సందేశం ఏమిటి?
తెలంగాణ యువత శక్తి సామర్థ్యాలు అపారమైనవి. మీరు కుటుంబ, అవినీతి రా జకీయాలకు దూరంగా ఉండాలి. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రధాని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. దేశ నిర్మాణంలో, రాష్ర్ట నిర్మాణంలో భాగస్వాములు కావాలని నేను యువతను కోరుతున్నా.
చివరిగా, విజయక్రాంతి ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. మీరు ఇప్పటికే రెండు పార్టీల బీఆర్ ఎస్, కాంగ్రెస్ మోసపూరిత పాలనను చూ శారు. ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొ మ్మా బొరుసు. తెలంగాణకు నిజమైన అభివృద్ధి, సుపరిపాలన అందించగల ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీయే. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి, డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు సహకరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బంగారు తెలంగాణ నిర్మాణం బీజేపీతోనే సాధ్యం. జై తెలంగాణ! జై హింద్.