22-09-2025 12:11:10 AM
-వాడకోటి చొప్పున వెలుస్తున్న బెల్ట్ షాపులు
-తెలిసినా పట్టించుకొని ఎక్సైజ్ అధికారులు
చండూరు, సెప్టెంబర్21 (విజయ క్రాంతి): మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండల పరిధిలోని గ్రామాలలో కిరాణా షాపులలో బెల్ట్ షాపులు జోరుగా విక్రయిస్తున్నారని గ్రామాలలో విమర్శలు లేకపోలేదు. మునుగోడు నియోజక వర్గాన్ని గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో కొన్ని నెలల క్రితం గ్రామాలలో బెల్ట్ షాపులు బందు చేయమని ఆదేశాలు జారీ చేయడంతో కొంత బెల్ట్‌షాపులు బందు అయిన ప్పటికీ ఎప్పటిలాగానే మళ్లీ బెల్టు షాపులు ప్రతి కాలనీలలో దొంగ చాటుగా అమ్ముతున్నారని ఆరోపణలు వెళ్లు వెత్తుతున్నాయి.
ఒకపక్క ఎక్సైజ్ అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పటికీ అధికారులకు దొరకకుండా కిరాణా షాప్ యజమానులు చాలా జాగ్రత్తగా వహిస్తున్నారని, గ్రామంలో తెలిసిన వారి ఇంట్లో మందు సీసాలను భద్రపరచుకోవడం ఒక విషయం అయితే, ఒకటో రెండో క్వార్టర్ సిసాలు షాపులలో పెట్టుకొని మేము అమ్మడం లేదని, మొన్న మా చుట్టాలొస్తే తెచ్చామని ఎక్సైజ్ అధికారులనే తప్పు త్రోవ పట్టిస్తున్నారు. ఏ షాపులలో ఏ ఒక్క క్వార్టర్ సీసా దొరికిన తక్షణమే కేసులు నమోదు చేయాలని వివిధ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొంతమంది అధికారులతో కిరణ్ షాప్ యజమానులు కుమ్మక్కై బెల్ట్ షాపుల దందా కొనసాగిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
మునుగోడు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో బెల్టు షాపుల దందా రోజురోజుకు పుట్టగొడుగుల పెరిగిపోతున్నాయి. రాష్ర్టంలోనే మునుగోడు నియోజకవర్గాన్ని బెల్ట్ షాపులు లేని గ్రామాలుగా చూడాలన్న ఎమ్మెల్యే సంకల్పం చాలా గొప్పది అయినప్పటికీ కొన్ని నెలల క్రితం గ్రామాలలో బెల్ట్ షాపులు నడవాలంటే చాలామందికి భయమేసేది. కానీ ఇప్పుడు ఇష్టానుసారంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు నడవడం చర్చనీయాంశం. గల్లీకో బెల్ట్ షాపులు బిచ్చల విడిగా అమ్ముతున్నారని, తక్కువ సమయంలో నాలుగు డబ్బులు సంపాదించు కో వాలంటే నాలుగు మద్యం సీసాలు అమ్మితే చాలు ఆరోజు కూలి వస్తుంది.
కానీ రోజం తా పనిచేసి ఆ డబ్బును తాగుడు కి పెడుతుంటే, పేద మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని పలు గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బెల్టు షాపు నిర్వహించుకోవాలంటే ఎవరు పర్మిషన్ అక్కర లేదు వైన్ షాప్ క్వాటర్ సీసాల పైన అదనంగా రూపాయలు చెల్లిస్తే ఎవరి పర్మిషన్ లేకుండా బెల్టుషాప్ దందా నిర్వహించుకోవచ్చు. గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ మధ్య విక్రయించరాదని ఆదేశాలు ఉన్నాయి. అయినా ఆ నిబంధనలకు నిర్వాహకులు పాటించడం లేదని తెలుస్తుంది. దీంతో మద్యం అమ్మకాలు గుట్టు చప్పుడు కాకుండా జోరుగా సాగిస్తున్నారు.
గ్రామాలలో బెల్ట్ షాపులు అందుబాటులో ఉండ డంతో పొద్దంతా కష్టపడి సంపాదించిన కూలి డబ్బులతో మద్యం తాగుతూ సంసారాలు పాడు చేసుకుంటున్నారు. సంపాదన మధ్యనికి ఖర్చు చేస్తుండ డంతో వారి కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. మద్యానికి బానిసలైన కొందరు ఏ పని చేయకుండా ఉదయాన్నే బెల్ట్ షాపులకు చేరుకొని ఉద్దర పెట్టి అప్పుల పాలవుతున్నారు.పల్లెల్లోని ప్రజలు బెల్ట్ షాపు అందుబాటులో ఉండడంతో మద్యం కొనుగోలు చేయాలంటే క్వార్టర్ సీసా మీద 30 నుంచి 40 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని సమాచారం.
ఇకబీర్ సీసా మీద 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని గ్రామాల్లోని మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాప్ యజమానులు వైన్ షాప్ లలోనే మద్యం అమ్మకాలు జరగాలని ప్రభుత్వం నియమాలు ఉన్నప్పటికీ అవేమీ పట్టనట్టుగా వైన్ షాప్ యజమానులు బెల్ట్ షాపులు అమ్మే వ్యక్తులకు సహకరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
బెల్ట్ షాపులలో ఎక్సైజ్ అధికారుల నిఘా ఎక్కడ..?
మునుగోడు నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు ఒకటి నుండి ఐదు వరకు బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలపై మహిళలు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గం లోని చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, గట్టుప్పల, చండూరు, నాంపల్లి, మర్రిగూడ ఈ మండలాల్లో ఎక్సైజ్ అధికారులు నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు.
నియోజకవర్గం లోని ఏ గ్రామానికి వెళ్లిన వీధి వీధినా బెల్ట్ షాపులు ఉండడం అందరికీ తెలిసిందే. పండుగలు, ఎన్నికలు, ఇతర సందర్భాల్లో బెల్ట్ షాపులు మూసేస్తుంటారు కానీ మళ్లీ యధావిధిగా నడుస్తుంటాయి. దసరా వస్తుందంటే గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు పక్కింట్లో సందులో ఇండ్లలో మద్యాన్ని భద్రపరుస్తున్నారు. కొన్ని గ్రామాలలో వెహికల్‌లో కూడా మద్యం అమ్మకాలు ఆన్లైన్ బిజినెస్ గా మారిపోయింది. బెల్ట్ షాపులలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
ఊళ్ళల్లో ఎక్కడపడితే అక్కడ మద్యం దొరుకుతుండడంతో యువత పెడదారి పడుతున్నారు. మద్యానికి బానిసై కుటుంబాలను పట్టించుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. బెల్ట్ షాప్ యజమానులు ప్రభుత్వ ధరలకు రెండింతలు విక్రయించి సొమ్ము చేసుకుంటు న్నారు. ఇప్పటికైనా అధికారులు బెల్ట్ షాపులకు నిఘా పెట్టకుండా ఉంటే మాత్రం గ్రామాలలో ప్రజలు తాగుడుకు బానిసై కుటుంబాలు విధిన పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు గ్రామాలలో మద్యం అమ్మకాలపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.