calender_icon.png 22 September, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణంపై అధికారుల మౌనం!

22-09-2025 12:38:36 AM

  1. మణికొండలో అక్రమ కట్టడానికి అండగా నిలుస్తున్నదెవరు?
  2. రోడ్డును తవ్వేసినా నోటీసులు ఇవ్వని అధికారులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  3. శాఖల మధ్య సమన్వయ లోపం జోరుగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు 

మణికొండ, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి ): ఒక ప్రభుత్వ శాఖ ‘అక్రమం’ అని రెండుసార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆ భారీ నిర్మాణం ఆగలేదు. పైగా, ఆ కట్టడం కోసం ఏకంగా ప్రభుత్వ రహదారినే రాత్రికి రాత్రే తవ్వేశారు. ఇంత జరుగుతున్నా మణికొండ మున్సిపల్ అధికారులు మాత్రం ‘మేము నోటీసు తయారు చేస్తున్నాం’ అంటూ కాలయాపన చేస్తుండటం తీవ్ర విమర్శలకు, అనుమానాలకు తావిస్తోంది.

అక్రమ నిర్మాణదారుడికి అండగా నిలుస్తున్న ఆ ‘అదృశ్య శక్తి’ ఎవరిదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణికొండ మున్సిపాలిటీ ఆల్కాపురి టౌన్షిప్, రోడ్ నంబర్ 16 (నేతాజీ పార్క్ వద్ద)లో ఎండోమెంట్ భూమిలో తప్పుడు సమాచారంతో హెచ్‌ఎండీఏ అనుమతులు పొంది ఒక భారీ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కట్టడానికి డ్రైనేజీ పైప్లైన్ వేయడం కోసం బిల్డర్ గుట్టుచప్పుడు కాకుండా రోడ్డును తవ్వేశాడు.

ఈ విషయం మీడియాలో ప్రసారం కావడంతో, ఫిర్యాదుల మేరకు అధికారులు వచ్చి ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామ మాత్రపు తనిఖీలు చేసి వెళ్లిపోయారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇదే నిర్మాణంపై ఎండోమెంట్ అధికారులు ఇప్పటికే రెండుసార్లు పనులు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. ఒక ప్రభుత్వ శాఖ చర్యలు తీసుకుంటుంటే, మరో ప్రభుత్వ శాఖ అయిన మున్సిపాలిటీ ఎందుకు మౌనం వహిస్తోందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

బిల్డర్కు నోటీసులు ఎప్పుడు ఇస్తారు? అని అధికారులను నిలదీస్తే, ఈరోజు ఇస్తున్నాం, రేపు ఇస్తున్నాం అంటూ దాటవేస్తున్నారని, అధికారి సంజయ్ అయితే నోటీసు తయారు చేస్తున్నాం అని చెప్పి గడుపుతున్నారని వారు మండిపడుతున్నారు.

‘అనుమతులు లేకుండా రోడ్లు తవ్వితే కఠిన చర్యలు తప్పవు‘ అని సెప్టెంబర్ 12న హెచ్చరికలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, ఇప్పుడు ఈ అక్రమంపై ఎందుకు స్పందించడం లేదు? ఆయన మాటలకు విలువ లేదా? లేక బిల్డర్ ఒత్తిళ్లకు తలొగ్గారా? అని స్థానిక ప్రజలు నిలదీస్తున్నారు. అధికారుల తీరు చూస్తుంటే, అక్రమానికి అండగా నిలుస్తూ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఈ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.