calender_icon.png 1 December, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్ ఆగ్రహం!

28-11-2025 12:00:00 AM

అమెరికాలోని అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో గస్తీ కాస్తున్న ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎస్‌ఎస్‌జీ)పై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ప్రపంచంలో అత్యంత భద్రత ఉండే ప్రదేశాల్లో వైట్‌హౌస్ ఒకటి. వైట్‌హౌస్ సమీపంలో గార్డ్స్‌పై కాల్పులు జరిపిన నిందితుడు అఫ్గానిస్థాన్‌కు చెందిన 29 ఏళ్ల రెహ్మనుల్లా లఖన్‌వాల్‌గా పోలీసులు తేల్చారు. 2021లో  జో బైడెన్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో చేపట్టిన ‘ఆపరేషన్ అలైస్ వెల్‌కమ్’ ప్రోగ్రామ్ కింద అఫ్గానిస్థానీయులకు ఇచ్చిన స్పెషల్ వీసాపై రెహ్మనుల్లా అమెరికాకు వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు.

2021లో తాలిబన్లు అఫ్గానిస్థాన్‌లో తిరిగి అధికారాన్ని చేపట్టడంతో వారి కబంధ హస్తాల నుంచి తప్పించుకునేందుకు అఫ్గాన్ జాతీయులు వలస బాటను ఆశ్రయించారు. ఈ నేప థ్యంలో అప్పటి బైడెన్ ప్రభుత్వం ‘ఆపరేషన్ అలైస్ వెల్‌కమ్’ కార్యక్రమం ద్వారా వలస వచ్చిన అఫ్గాన్ జాతీయులను రెండేళ్ల పెరోల్ గ్రాంట్ కింద ఆశ్రయం కల్పించారు. అయితే అప్పుడు అఫ్గాన్లకు శాశ్వత వలస హోదా ను ఇవ్వలేదు.

ఒకవేళ అమెరికాలో ఉండాలనుకుంటే యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కింద అఫ్గాన్ జా తీయులు వివిధ కారణాలు చూపెట్టి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. దాదాపు ఒక సంవత్సర కాలం పాటు అమల్లో ఉన్న యూఎస్‌సీఐఎస్ కార్యక్రమం కింద దాదాపు 77వేల మంది ఆఫ్గన్లు అమెరికాలోకి వలసదారులుగా ప్రవేశించినట్లు కాంగ్రెషనల్ రీసెర్చీ సర్వీస్ సంస్థ అంచనా వేసింది.

ఇక మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ సంస్థ 2022 వరకు అమెరికాలో దాదాపు 2 లక్షల మంది అఫ్గాన్ వలసదారులు ఉన్నారని అంచనా వేసింది. వీరిలో అత్యధిక జనాభా వాషింగ్టన్ డీసీ, కాలిఫోర్నియాలోని సాక్రమెంటో ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపింది. అయితే ట్రంప్ రెండో దఫా అమెరికా అధ్యక్షుడయ్యాకా అఫ్గాన్ నుంచి వచ్చే వలసదారు ల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2024 వరకు చూసుకుంటే ప్రతినెలా దాదాపు 3,100 మంది అఫ్గాన్ శరణార్థులకు అమెరికాలో పునరా వాసం కల్పించారు.

అయితే ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు చూసుకుంటే అఫ్గాన్ నుంచి వచ్చే వలసదారుల సంఖ్య మూడింట రెండొంతులు తగ్గడం గమనార్హం. అటు అమెరికాకు మంచి మిత్ర దేశమైన పాకిస్థాన్‌తో కయ్యానికి కాలు దువ్వడం కూడా యూఎస్‌కు నచ్చలేదు. దీంతో అఫ్గాన్ నుంచి వచ్చే వలసదారులపై ఆంక్షలను మరింత కఠినతరం చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా కాల్పులను ఉగ్రచర్యగా అభివ ర్ణించారు. అంతేకాదు బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అఫ్గాన్ నుంచి దేశంలోకి వలస వచ్చిన వారందరిని తిరిగి విచారించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇటు కాల్పుల ఘటనతో యూఎస్‌సీఐఎస్ కీలక నిర్ణ యం తీసుకుంది. అఫ్గానిస్థాన్ ఇమిగ్రేషన్ దరఖాస్తులు వెంటనే నిలిపివేస్తున్నామని.. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

అమెరికన్ల భద్రతే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. తాజా నిర్ణయం అఫ్గాన్ వలసదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. గతంలో కూడా వైట్ హౌస్ వద్ద కాల్పులు జరిగిన సంఘనలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి లో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఓ వ్యక్తిపై కాల్పులు జరిపారు. అలాగే అక్టోబర్‌లో ఓ కారు ఏకంగా వైట్‌హౌస్ గేటునే ఢీకొట్టడం గమనార్హం.