28-11-2025 12:00:00 AM
మహాత్మా జ్యోతిరావు పూలే సామాజిక వర్గాల హక్కుల కోసం 19వ శతాబ్దంలో నడిపిన ఉద్యమాలను, ఎదుర్కొన్న అనుభవాలను ఇప్పటి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముంది. జ్యోతిరావు ఫులే భారతీయ సాంస్కృతిక పునర్జీవ పితామహుడు. హిందూ సాంప్రదాయక కుల వ్యవస్థను, అసమానతలు సృష్టిస్తున్న బ్రాహ్మణిజాన్ని, కులం పేరుతో వ్యక్తులను చిన్న చూపు చూసే విధానంపై తిరుగుబాటు చేసిన గొప్ప దార్శనికుడు.
కుల వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమాలను కొనసాగించిన వారు ఉన్నప్పటికీ, జ్యోతిరావు ఫులే హిందూమతత్వ మూలా ల్లోకి వెళ్లి సామాజిక అసమానతలకు కారణమవుతున్న వర్ణ, వర్గ సమాజాన్ని నిర్మూలించడానికి రాజీలేని పోరాటం కొనసాగించారు. నేడు మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధం తి. ఫులే విద్యార్థి దశలో ఉన్నప్పు డు అమెరికా స్వతంత్ర ఉద్యమం, శివాజీ జీవిత చరిత్ర,థామస్ పె యిన్ రచన ‘మానవుని హక్కులు’, జాన్ స్టువర్ట్ రాసిన ‘స్వతంత్రం’ అమితంగా ప్రభావం చేశాయి. ఫు లే జీవితంలో ఒక అసాధారణ సం ఘటన ఆయన్ను సామాజిక సేవ కు అంకితమయ్యేటట్లుగా మార్చేసింది.
ఫులేకు పరిచయమున్న ఒక బ్రాహ్మణ మిత్రుడు తన పెళ్లి ఊరేగింపుకు ఆహ్వానించాడు. ఊరేగింపులో పాల్గొన్న ఫులేను బ్రాహ్మణులు పక్కకు నెట్టివేసి.. ‘శూద్ర కులంలో పుట్టిన నువ్వు ఇందులో పాల్గొనడానికి ఎంత ధైర్యం?’ అని ఆయన ముఖం మీదే అవమానించారు. ఈ అవమానం తట్టుకోలేని ఫులే విషయాన్ని తన తం డ్రికి వివరించారు. సమాజంలో కొనసాగుతూ వస్తున్న కులాచారాలను, కట్టుబాట్లను, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అందరూ విధిగా అంగీకరించాల్సిన పరిస్థితి ఉందని, మాట వినని వారి తలను మదపుటేనుగులతో తొక్కించి చంపించేవారని ఫులే తండ్రి పేర్కొన్నారు.
ఈ వాదనతో ఫులే ఏకీభవించలేదు. శూద్రులు, అతిశూద్రులు ఈ అవమానాలను, ఆకృత్యాలను ఎందుకు సహించాలి? ఆత్మాభిమానం, స్వాభిమానంతో వాళ్లను ధిక్కరించి జీవించలేమా? అన్న ఆలోచనా నేపథ్యం నుంచి ఫులే లో సామాజిక ఆశయాలు పురుడు పోసుకున్నాయి. ‘సత్యమేవ జయతే’ అనే భారతీయ సూక్తి ఆధారంగా ‘సత్యశోధక్ సమాజ్’ సంస్థను సెప్టెంబర్ 24 1873న స్థాపించారు. దేవునితో బంధాలు, సమాజంతో సౌభాతృత్వం, మానవీయ సంబంధాలను కొనసాగించడం, శూద్రులకు, అతిశూ ద్రులకు విద్య ను అందించడంలో ప్రత్యేక పాఠశాలల ఏర్పాటు అనేది సంస్థ ప్రధాన సిద్ధాంతాలు.
తన ఉద్యమ జీవితంలో ఏర్పడిన సమస్యలు, సంఘటనలు, అవమానాలను తట్టుకొని అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయం గా పో రాడారు. 1888లో మహారాజ్ సైయాజీ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మహారాష్ర్టకు చెందిన నాయకులు, ఉద్యమకారులు, ప్రజ లు అధిక సంఖ్యలో పాల్గొని ఫులేకు ‘మహాత్మా’ బిరుదుతో సత్కరించారు.
వ్యక్తులంతా సామాజిక, సాంకేతిక పరిజ్ఞానం కలవారిగా తయారు కావాలని ఫులే ఆకాంక్షించారు. ఆ దిశగా నిరంతరం అధ్యయనం చేసిన ఫులే అంతిమంగా ఉన్నత సామాజిక వ్యవస్థ ఆవిష్కరణకు పాటుపడ్డారు. ఇం తటి ఘన కీర్తి కలిగిన సామాజిక విప్లకారుడు జ్యోతిరావు ఫులేకు భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో గౌరవించాల్సిన అవసరముంది.
కిరణ్ ముదిరాజ్, 9848026576