07-08-2024 12:00:00 AM
సూర్యాపేట జిల్లా పర్యాటక ప్రదేశాలకు ఖిల్లా.. అతి పురాతన కట్టడాలు, అపురూప నిర్మాణాలకు నెలవు.. బౌద్ధుల ఆరామాలు, కాకతీయుల కళాఖండాలు.. గొలుసు కట్టు చెరువులకు ఆవాసంగా ఉన్నా సూర్యాపేట పర్యాటక కేంద్రంగా ఎదగడం లేదు. జిలా ్లకేంద్రంతోపాటు అనేక ప్రాంతాల్లో చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యటక ప్రదేశాలు పర్యటకులకు కనువిందు గొలిపేలా ప్రదేశాలు.
పురాతన కట్టడాలు, ఎత్తయిన కొండలు, దట్టమైన అడవులు, ప్రాచీన శిలాయుగం నాటి రాక్షసగుళ్లు, క్రీస్తు పూర్వం నాటి బౌద్ద స్తూపాలు, కాకతీయుల నాటి ప్రసిద్ద శివాలయాలు, అపురూప శిల్పాలు, మండపాలు.. ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలకు నిలయం సూర్యాపేట.
పిల్లలమర్రి
సూర్యాపేట జిల్లా కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారికి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న పిల్లలమర్రి శివాలయాలు కాకతీయుల కాలం నాటివి. క్రీ.శ. 1203లో కాకతీయ సామంతరాజు అయిన రేచర్ల వంశానికి చెందిన బేతిరెడ్డి పిల్లలమర్రి గ్రామాన్ని నిర్మించినట్టు శిలాశాసనాలు తెలుపుతున్నాయి.
ఇక్కడ నిర్మించిన శివాలయాలు కళలకు ప్రసిద్ధి. ఎర్రకేశ్వర ఆలయం, త్రికుంటేశ్వరాలయం, నామేశ్వరాలయాలు కాకతీయుల కళానైపుణ్యానికి అద్దం పడుతాయి. శిలాశాసనాలు, వైవిధ్యభరితమైన శిల్పాలు, ఈ ఆలయాల్లో ఉంటాయి. సప్త స్వరాలను వినిపించే రాతిస్తంభాలు, ఆలయాలు పూర్తిగా రాతి కట్టడాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
బౌద్ధక్షేత్రం ఫణిగిరి
సూర్యాపేట జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో జనగామ రహదారిపై ఉన్న ఫణిగిరి గ్రామం ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలకు నిలయం. ఇప్పటికే ఈ గ్రామం పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్నది. ఫణిగిరి కొండ 16 ఎకరాల విస్తీర్ణంలో ఉంది.
ఇక్కడ క్రీ.పూ 13వ శతాబ్దం నాటి బౌద్ద మహా స్తూపం, మందమౌన ఇటుకలతో నిర్మించిన చైత్యగదులు, విహారాలు, పాలరాతి శిల్పాలు, బౌద్ద జాతక కథలతో చెక్కిన తోరణాలు, బ్రహ్మలిపిలో ఉన్న శిలా శాసనాలు, ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుతాయి. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో రోమన్ రాజుల కాలం నాటి బంగారు, వెండి, గాజు, రాగి, నాణాలు దొరికాయి.
వీటిని కొండపై భద్రపరిచారు. ఇలా తవ్వకాల్లో బయటపడిన వస్తువులు ప్రాచీన కాలం నాటి ఆనవాళ్లకు ఆధారాలుగా నిలిచాయి.
పురాతన గిరిదుర్గం
తెలంగాణలో అత్యంత పొడవైన పురాతన గిరిదుర్గంగా ప్రసిద్ధి పొందిన కట్టడాలు ఉన్న ప్రాంతం ఉండ్రుగొండ. సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో జాతీయ రహాదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండ్రుగొండ చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. చుట్టూ కొండలు, దట్టమైన అడవి మధ్య ఆధ్యాత్మికత ఉట్టిపడే విధంగా లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంటుంది.
దేశంలోనే ప్రసిద్ధి పొందిన ఉండ్రుగొండ కోట చరిత్రకు నిలువెత్తు నిదర్శనం. 1370 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్ల మధ్య తొమ్మిది కొండలను కలుపుతూ 14 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఎత్తయిన దుర్గ ప్రాకారాలు, కొలనులు కొండపైన ఉన్న గొలుసుకట్టు నీటి కుంటలు, పురాతన దేవాలయాలు ఉండ్రుగొడ ప్రత్యేకత.
శాతవాహనులు, కల్యాణచాళుక్యులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు, రేచర్లరెడ్డి రాజులు, పద్మనాయకులు ఈ కోటలను అభివృద్ధి చేసినట్టు శాసనాలు చెప్తున్నాయి. ఈ గుట్టలపై శ్రీలక్ష్మీనరసింహస్వామీ, గోపాలస్వామి, కాలభైరవుడు, రాజభవనాలు, నర్తనమణుల గృహాలు, భోగందాని గద్దెమండపం, చాకలిబావి, మంత్రిబావి, నాటి చారిత్రక వైభవానికి ప్రతీకలుగా ఉన్నాయి. కొండపై నుంచి పెన్‌పహడ్ మండలం నాగులపహడ్ వరకు సొరంగమార్గం ఉండేదని ఈ ప్రాంత ప్రజలు చెప్తుంటారు.
గొల్లగట్టు జాతర
సమ్మక్క సారలమ్మ జాతర తరువాత తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర సూర్యాపేట జిల్లాలోనే పెద్దగట్టు. సూర్యాపేటకు ఏడు కిలో మీటర్ల దూరంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న దురాజ్‌పల్లిలోఉన్న పెద్దగట్టు (గొల్లగట్టు) వద్ద ప్రతి రెండేళ్లకు ఓసారి జాతర జరుగుతుంది. ఈ జాతరకు తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. కోరిన మొక్కలు తీర్చే స్వామిగా పేరొందిన లింగన్న దర్శనానికి ఇప్పుడు ప్రతి రోజు భక్తులు వస్తున్నారు.
తాందారపల్లి శ్రీనివాసులు
సూర్యాపేట, విజయక్రాంతి
మత ఐక్యతకు చిహ్నం
కుల మతాలకతీతంగా దర్శించుకునే ప్రదేశం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలోని జాన్‌పహడ్ దర్గా. నాలుగు శతాబ్దాల చరిత్ర గల ఈ దర్గాలో హజ్రత్ సయ్యద్ మోహినుద్దిన్‌షా, జాన్‌సాక్ షాహిద్ రహమతుల్లా సమాధులు ఉన్నాయి. ఈ దర్గాను మానవత్వానికి, త్యాగానికి చిహ్నంగా భావిస్తారు. ఇక్కడ ఉర్సు సందర్భంగా పంచే గంధానికి ప్రత్యేకత ఉంది.
అయితే ఈ దర్గా మాత్రం ఏండ్లుగా అభివృద్ధికి దూరంగానే ఉంటుందని చెప్పవచ్చు. దర్గాకు సమీపంలో కృష్ణా నది ఉండటంతో పర్యాటకులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నది. ఇవే కాకుండా ప్రత్యేకత గల అనేక దేవాలయాలు, కట్టడాలు సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి. మూసి రిజర్వాయర్, నాగుల పహడ్ శివాలయం, మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, మిర్యాలలో సీతరామచంద్రస్వామి ఆలయం ఇలా అనేక ప్రదేశాలు ఉన్నాయి.