23-07-2025 08:11:28 PM
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ..
నకిరేకల్ (విజయక్రాంతి): రామన్నపేటలో అదానీ అంబుజా సిమెంట్ పరిశ్రమ నెలకొల్పితే ప్రతిఘటిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుండి సూర్యాపేట వెళుతున్న క్రమంలో రామన్నపేట సుభాస్ సెంటర్లో సిపిఎం మండల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ, దేశీయ బడా పెట్టుబడిదారునైనా అదానీ సిమెంట్ పరిశ్రమ నెలకొల్పి పచ్చని పల్లెల్లో కాలుష్య భూతాన్ని పెంచి పోషించాలని చూస్తే కమ్యూనిస్టులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రజా అభిప్రాయ సేకరణలో మండల వ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంగా వ్యతిరేకించినా మళ్లీ దొడ్డి దారిన వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. పోరాటాల పురిటి గడ్డ అయిన రామన్నపేట ప్రజలు మరోసారి తిరగబడి ప్రతిఘటిస్తారని హెచ్చరించారు.
ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన రిపోర్టుని బహిర్గతం చేయాలని, వెంటనే సిమెంట్ పరిశ్రమను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ప్రజల సమస్యలను తెలియజేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యుడు బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బోయిని ఆనంద్, మండల కమిటీ సభ్యులు గొరిగే సోములు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు గంటపాటు శివకుమార్,డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు శానకొండ రామచంద్రం, మెట్టు శ్రవణ్ కుమార్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్, ఆముద ఆంజనేయులు, భావనలపల్లి సత్యం,కునూరు గణేష్, రాసాల రమేష్, పొట్లచెరువు నాగయ్య తదితరులు పాల్గొన్నారు.