23-07-2025 08:20:21 PM
అమ్మవారికి బోనాల సమర్పణ..
మందమర్రి (విజయక్రాంతి): ఆషాడ మాసంను పురస్కరించుకొని సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు, శాకాంబరి ఉత్సవాలు, గోరింటాకు వేడుకలు లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇల్లందు క్లబ్లో బుధవారం నిర్వహించిన వేడుకల్లో సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు స్వరూప రాణి - దేవేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే బోనాల పండుగను సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో వర్షాలు పడడం వలన వాతావరణం చల్లబడి ఒంట్లో వేడి అలాగే ఉంటుందని బయటి వాతావరణానికి సమానంగా మన శరీరం మారదన్నారు.
గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉందని, రోగ నిరోధక శక్తిని పెంచి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుందన్నారు. అనంతరం ఏరియా అధికారుల సతీమణు లు, మహిళలు, యువతులతో గోరింటాకు వేడుకల్లో పాల్గొన్నారు.అంతకు ముందు మహిళలు అమ్మవారికి ఆషాఢ మాసం బోనాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ కార్యక్రమంలో లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ స్వరూప రాణి, సెక్రెటరీ మణి, ట్రెజరర్ కవిత, జాయింట్ ట్రెజరర్, సుజాత, కమిటీ సభ్యులు సుల్తానా, శ్రీలత, రాధిక, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.