25-10-2025 01:11:34 AM
దరఖాస్తులు తగ్గినా.. పెరిగిన ఎక్సైజ్ ఆదాయం
మహబూబాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): 2025 27 కాలానికి మద్యం షాపుల నిర్వహణకు మహబూబాబాద్ జిల్లాలో లైసెన్సుల జారీ కోసం దరఖాస్తుల ద్వారా 54 కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ శాఖకు లభించింది. 2023 25 కాలానికి పోలిస్తే దరఖాస్తుల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం విశేషంగా మారింది.
జిల్లా వ్యాప్తంగా 2023 25 లైసెన్సు కోసం 2,589 మంది దరఖాస్తు చేయగా, ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షల రూపాయలను ఫీజుగా చెల్లించడంతో 51.78 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. తాజాగా 2025 27 కాలానికి 1,800 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే ఈసారి 789 దరఖాస్తులు తగ్గాయి. తొలుత సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 18 వరకు 1,672 దరఖాస్తులు రాగా, మరో ఐదు రోజులు పొడిగించి 23 వరకు లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. దీనితో అదనంగా 112 దరఖాస్తులు వచ్చాయి.
గతంతో పోలిస్తే ఈసారి నాన్ రిఫండ్డబుల్ దరఖాస్తుల రుసుమును రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ ఆదాయం పెరగడానికి కారణంగా మారింది. అలాగే గతంలో 59 మద్యం షాపులు ఉండగా కొత్తగా రెండు మద్యం షాపులను జిల్లాకు సర్దుబాటు చేశారు. దీనితో జిల్లా పరిధిలో మద్యం షాపుల సంఖ్య 61 చేరింది. మొత్తంగా మానుకోట జిల్లా వ్యాప్తంగా 61 మద్యం షాపులకు 1,800 మంది దరఖాస్తులు చేసుకోగా 54 కోట్ల రూపాయల ఆదాయం కేవలం దరఖాస్తుల రూపంలో ఎక్సైజ్ శాఖకు సమకూరింది. జిల్లాలోని 61 మద్యం షాపులకు గాను, మహబూబాబాద్ సర్కిల్ పరిధిలో 667, తొర్రూర్ సర్కిల్ లో 769, గూడూరు సర్కిల్ పరిధిలో 364 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి కిరణ్ తెలిపారు.
పెద్ద వంగర టాప్..!?
జిల్లా పరిధిలోని పెద్ద వంగర మద్యం షాపుకు అత్యధికంగా 110 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో పెద్దవంగర మద్యం షాపు దరఖాస్తుల్లో అగ్ర భాగాన నిలిచింది. గూడూరు సర్కిల్ పరిధిలోని షాప్ నంబరు 3 కు అత్యల్పంగా కేవలం 17 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా..
2025 27 సంవత్సరాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 300 మద్యం షాపులకు గాను10,461 దరఖాస్తు వచ్చాయి. మొత్తంగా 313.8 కోట్ల రూపాయల ఆదాయం దరఖాస్తుల రూపంలో వచ్చింది. జిల్లాల వారీగా మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లాలో 67 షాపులకు 3,175 దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ జిల్లాలో 63 షాపులకు 1,958, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు కలిపి 59 షాపులకు 1,833, జనగామ జిల్లాలో 50 షాపులకు1,695 దరఖాస్తులు వచ్చాయి.