24-12-2025 12:01:26 AM
మెడికల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు డాక్టర్ అనే పదం వాడరాదు మిర్యాలగూడ ఐఎంఏ స్పష్టీకరణ
మిర్యాలగూడ, డిసెంబర్ 23 (విజయక్రాంతి): అర్హతకు మించి వైద్యం చేసే డాక్టర్లతో పాటు మెడికల్ ప్రాక్టీషనర్ల పై చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ మిర్యాలగూడ సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం పట్టణంలోని వాసంతి ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐ ఎం ఏ మిర్యాలగూడ అధ్యక్షులు డాక్టర్ అశ్విని కుమార్, మాజీ అధ్యక్షులు డాక్టర్ మాధవ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ శేఖర్ రెడ్డిలు మాట్లాడారు.
ఎంబీబీఎస్ పూర్తి చేసి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు మాత్రమే ఆస్పత్రి ఏర్పాటు, ప్రాక్టీస్ నిర్వహించాలన్నారు. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం ఆకస్మిక తనిఖీల్లో అర్హతకు మించి వైద్యం చేస్తున్న విషయాలు వెలుగులోకి రావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఏర్పాటు సమయంలో వైద్యధికారులు డాక్టర్ల ధ్రువీకరణ పత్రాలను సమగ్రముగా పరిశీలించడంతోపాటు ఐఎంఏ కార్యవర్గాన్ని సంప్రదించి అనుమతులిస్తే బాగుంటుందన్నారు.
వైద్యారోగ్యశాఖ పర్యవేక్షణలేక కొందరు ఎంబిబిఎస్ డిగ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకొని పీజీ చదివినట్లు బోర్డులు ప్రదర్శిస్తు, వారంలో ఒకసారి వచ్చి వెళ్తున్నారన్నారు. దింతో ఆసుపత్రుల టెక్నీషియన్లే వైద్యసేవలు చేస్తూ ప్రజారోగ్యంతో చేలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అర్హతలేని వైద్యులు వైద్య సేవలపై నిరంతరం నిఘా పెంచాలని కోరారు.
అదేవిదంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు నిర్వహించేవారు డాక్టర్ అనే పదం వాడరాదని, మందులు రాసి, ఇంజక్షన్లు ఇవ్వరాదన్నారు. అత్యవసర పరిస్థితిలో రోగిని క్వాలిఫైడ్ డాక్టర్ వద్దకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వాలి ఫైడ్ డాక్టర్లు తమ ప్రిస్కప్షన్ ని కాపిటల్ లెటర్స్ విడివిడి అక్షరాలు రాయాలని సూచించారు. డాక్టర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అర్హత లేని వారు కంటి వైద్యుల పేరుతో ఆస్పత్రులు నిర్వహిస్తూ, వైద్యులు లేకుండానే అర్హతకు మించి మందులు, పరీక్షలు చేయడం, కొన్ని చోట్ల ఆపరేషన్ చేస్తున్నారని, వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా మా వంతు సాయం చేసేందుకు ఐఎంఏ ముందుంటుందన్నారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ ఐ ఎం ఏ సెక్రటరీ డాక్టర్ జానకి రాములు, మాజీ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ సతీష్, మెడికల్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.