23 June, 2026 | 2:33 AM

సీపీ కార్యాలయంలో నషా ముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ

23-06-2026 12:15 AM

శేరిలింగంపల్లి,జూన్ 22 (విజయక్రాంతి): నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అడ్మినిస్ట్రేషన్ డీసీపీ టి. అన్నపూర్ణ, క్రైమ్ డీసీపీ ముత్యం రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటానికి ప్రభుత్వం, పోలీసు శాఖ వివిధ విభాగాలతో సమన్వయం చేసుకుని విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.సమాజంలో మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

అంతేకాకుండా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్‌ఓలు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు మరియు స్థానిక ప్రజలతో కలిసి డ్రగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించి, డ్రగ్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది సంబంధిత ఉద్యోగులు పాల్గొన్నారు.