calender_icon.png 8 November, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌తోనే నగరాభివృద్ధి

08-11-2025 01:00:59 AM

-బీఆర్‌ఎస్, బీజేపీలకు గుణపాఠం ఖాయం

-మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 7 (విజయక్రాంతి) : ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ ఉపఎన్నికలో ఓటర్లు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు గట్టి గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆజం నవీన్ యాదవ్‌కు మద్దతుగా శుక్రవారం ఆయన ఎల్లారెడ్డిగూడ డివిజన్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి తదితరులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రతి గడపకూ వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలుకరించి, వారి సమస్యలను శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, తక్షణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు.

అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. గత తొమ్మిదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసింది. కొన్ని ఫ్లుఓవర్లు, అండర్‌పాస్‌లు కట్టి నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకున్నారు తప్ప, వాస్తవ అభివృద్ధి శూన్యం, అని ఆయన విమర్శించారు.రాష్ర్ట ప్రభుత్వం నగరాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తుంటే, ఓర్వలేక ప్రతిపక్షాలు మాపై దుష్ర్పచారం చేస్తున్నాయని శ్రీధర్ బాబు మండిపడ్డారు.

తమకు అవకాశమిచ్చిన తెలంగాణ ప్రజల ఆశలు, భావితరాల ఆకాంక్షలే అజెండాగా అత్యంత పారదర్శకమైన పాలనను అందిస్తున్నామని ఆయన అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న తమ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉండి, నిరంతరం ప్రజల కోసం తపించే నవీన్ యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.