07-01-2026 12:00:00 AM
ఒక వార్డు నుంచి మరో వార్డుకు బదిలీ
ఆశావహుల కుట్రేనని అనుమానం
అయోమయంలో ఓటర్లు సవరణకు పెరుగుతున్న దరకాస్తులు
నాగర్‌కర్నూల్, జనవరి 6 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆయా వార్డుల వారీగా విడుదలైన ఓటర్ లిస్టులో తమ పేర్లు గల్లంతయ్యాయని ఓటర్లనుండి అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి.
ఒక వార్డు నుంచి మరో వార్డుకు తమ అనుమతి లేకుండా ఓటు జంప్ కావడంతో ఓటర్లంతా అయోమయంలో పడుతున్నారు. ఒకే ఇంట్లో నివసించే కుటుంబీకులు వేరు వేరు వార్డుల్లో కనిపించడంతో అవాక్కవుతున్నారు. మరికొన్ని వార్డుల్లో కులాల వారిగా, కాలనీ వారిగా ఇతర వార్డుల్లోకి జంప్ కావడంతో ఇది ముమ్మాటికి ఉద్దేశపూర్వకంగానే మార్పు జరిగాయన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీకి చెందిన వ్యక్తులుగా ముద్రపడిన వారిని సెలెక్టెడ్ గా ఇతర ప్రాంతానికి ఓట్లు బదిలీలు రాజకీయ దురుద్దేశమే దాగి ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మరి ముఖ్యంగా నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీలలో ఎక్కువగా ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇంకా రిజర్వేషన్లు ఖరారు కాకముందే ఆశావహులు తమ గెలుపు కోసం పావులు కదుపుతున్నట్లు ఇప్పటికే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విడుదల చేసిన ఓటరు లిస్ట్ కూడా సన్నటి ఇంగ్లీష్ అక్షరాలు ఫోటో లేకుండా కనిపించడంతో ఎక్కువ మంది తమ పేర్లు లిస్టులో కనుమరుగయ్యాయని కంగారు పడుతున్నారు. ఈనెల 9 లోపు సవరణకు అవకాశం ఇచ్చామని ఆయా రాజకీయ పార్టీ నేతలు కూడా ఓటర్లకు సహకరించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ చెప్తున్నారు.
కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు గానూ 44 పోలింగ్ స్టేషన్లను సిద్ధం చేశారు. పురుషులు 12,981 మంది మహిళలు 13,053 మంది మొత్తం ఓటర్లు 26,034 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన లిస్టులో సవరణ కోసం 2 అభ్యంతరాలు, కొల్లాపూర్ మున్సిపాలిటీలో 19 వార్డులకు 38 పోలింగ్ బూతులు ఉన్నాయి. పురుషులు 9663 మంది, మహిళలు 9807 మంది మొత్తం 19,470 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రస్తుతం విడుదలైన ఓటర్ లిస్టులో తమ ఓట్లు గల్లంతయ్యాయని 50 మంది సవరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులకు గాను 48 పోలింగ్ బూతులు ఉన్నాయి. పురుషులు 17,460 మంది, మహిళలు 17,918 మంది మొత్తం 35,378 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం విడుదల చేసిన ఓటర్ ముసాయిదాల్లో తీవ్ర అభ్యంతరాలు ఉన్నట్లు 47 మంది దరఖాస్తులు చేసుకున్నారు.
ఆశావహుల పనేనని అనుమానం.!
మున్సిపల్ కౌన్సిలర్లుగా పోటీకి దిగేందుకు సిద్ధమైన కొందరు ఆశావాహులు ఉద్దేశపూర్వకంగానే కొన్ని నూతన ఓటర్ నమోదు, చేర్పులు మార్పులు వంటివి వారికి అనుకూలంగా మార్చుకున్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. మరి కొంత మంది మాజీ కౌన్సిలర్లు తమ పరపతితో రెవెన్యూ మున్సిపల్ కార్యాలయంలో బూత్ లెవెల్ ఆఫీసర్ల సహకారంతో తమకు వ్యతిరేకంగా ఉంటారనుకున్న ఓటర్లను తొలగించారన్న ప్రచారం జరుగుతుంది.
మున్సిపాలిటీలో పనిచేసే ప్రభుత్వ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న సిబ్బంది పూర్తిగా అధికార, ప్రతిపక్ష పార్టీలోని ఆశావాహులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. వారికి అనుకూలంగానే ఆయా అవార్డుల్లోని కుల ప్రాతిపదికన ఓటరు లిస్టులోని పేర్లు జంప్ అవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి