calender_icon.png 29 December, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులందరికీ కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది

29-12-2025 08:10:26 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): రబీ 2025-26 సీజన్ కు సంబంధించి ప్రభుత్వం వద్ద రైతులకు కావాల్సినంత యూరియా అందుబాటులో ఉందని, ప్రతి ఒక్క రైతుకు యూరియా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సిఎస్ రామకృష్ణారావుతో కలిసి రబీ సీజన్ కు సంబంధించి యూరియా సరఫరా పై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ తో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వద్ద యూరియాకు సంబంధించి ఎలాంటి కొరత లేదని, పంపిణీకి విషయంలో  ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతుకు కావలసిన యూరియా నిల్వ ప్రభుత్వం వద్ద ఉందని, ప్రతి ఒక్కరికి సక్రమంగా ఉండేవిధంగా కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. యూరియా కంపెనీలో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

యూరియా బుకింగ్ కోసం తీసుకువచ్చిన యాప్ ఉపయోగకరంగా ఉందా అనే విషయాన్ని ఆరా తీశారు. అన్ని జిల్లాల్లో పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియాను పంటలకు కాకుండా ఇతర అవసరాలకు వాడకుండా కలెక్టర్లు నిత్యం యూరియా నిల్వలపై  పర్యవేక్షణ చేయాలన్నారు. రాబోయే పది రోజుల్లో యూరియా బుకింగ్ యాప్ అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. తప్పనిసరిగా పాస్ బుక్ ఆధారంగా యూరియా పంపిణీ చేయాలని సూచించారు. 

జిల్లాలోని రైతులందరికీ కావాల్సినంత యూరియా అందుబాటులో ఉంది: కలెక్టర్ ఆదర్శ్ సురభి

జిల్లాలో రైతులందరికీ కావాల్సిన అంత యూరియా అందుబాటులో ఉందని, ప్రతి ఒక్క రైతుకు యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. యూరియాకు సంబంధించి ఎటువంటి కొరత లేదని ఎవరైనా అసత్యాలు ప్రచారం చేస్తే రైతులు నమ్మవద్దని తెలిపారు. జిల్లాలో ఉన్న రైతులందరికీ యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

యూరియా బుకింగ్ యాప్ ద్వారా నేరుగా కూడా యూరియా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచే యూరియా సరఫరా ప్రారంభం చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని యూరియా విక్రయ కేంద్రాల నుంచి ప్రతిరోజు ఎంత యూరియా నిల్వలు ఉన్నాయని నివేదిక సమర్పించాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

జిల్లాలోని అన్ని ప్రైవేటు తో పాటు ప్రభుత్వ, పిఎసిఎస్, మార్క్ఫెడ్ యూరియా విక్రయ కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా  సరిపడు కౌంటర్లు నిర్వహించాలని సూచించారు. ఇతర జిల్లాల వారికి యూరియా ఇవ్వకుండా కేవలం మన జిల్లా వారికి మాత్రమే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ దుకాణ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు సక్రమంగా అందే విధంగా సూచనలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం బోనస్ కల్పిస్తున్న నేపథ్యంలో రైతులు దొడ్డు రకం వైపు మల్లకుండా సన్న రకాలే వేసే విధంగా మండల వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి దామోదర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి విజయభాస్కర్ రెడ్డి, డీసీఓ రాణి, మండల వ్యవసాయ అధికారులు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.