13-09-2025 12:16:56 AM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా పని చేస్తోందని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరత తీర్చేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రితో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చర్చించి అదనపు యూరియాను రాష్ట్రానికి తెప్పిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక రేక్ లు ఏర్పాటు చేసి మంచిర్యాల జిల్లా రైతులకు యూరియా లోటు లేకుండా చేస్తామన్నారు. కొందరు ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలని రైతులను పక్క దారి పట్టించేలా చేస్తున్నారని పరోక్షంగా విపక్షాలపై మండిపడ్డారు. రైతులకు ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరుగకుండా చూస్తామన్నారు.
అంతేకాకుండా మంచిర్యాల జిల్లా ప్రజల కోసం ఏం పీ వంశీ కృష్ణ వందేభారత్ ఎక్సప్రెస్ నిలుపుదల కోసం ఎంతోగానో కృషి చేశారన్నారు. తెలంగాణకు యూరియా లోటు రాకుండా చూడాలని కూడా గతంలోనే కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసానిచ్చారు.అంతకుముందు పలువురు కార్యకర్తలు మంత్రి దృష్టికి పలు విషయాలను తీసుకెళ్లారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారిని గుర్తించాలని కోరారు. కొందరికి ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని పేర్కొన్నారు.అనంతరం పలువురు కార్యకర్తల విజ్ఞప్తి మేరకు స్థానిక టీ స్టాల్ లో మంత్రి టీ తాగి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.