03-09-2025 06:47:35 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జల్లెల పెంటయ్య
నకిరేకల్,(విజయక్రాంతి): రామన్నపేట మండలంలో రైతులకు సరిపడ యూరియా సకాలంలో అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియా కొరత విషయంలో కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ దోబూచులాడుతున్నాయని అన్నారు.
అనేక మంది రైతులు రోజుల తరబడి వేచి చూసిన యూరియా అందడం లేదని దీనికి గల కారణాలను వెతికి సమస్యనునివారించాలన్నారు. బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ... ఉక్రెయిన్, రష్యా యుద్ధం మూలంగా చైనా యూరియా ఆపింది అంటూ హాస్యాస్పదంగా పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. రైతాంగానికి సరిపడా యూరియా అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని అది సక్రమంగా రైతుల వరకు చేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు.
రామన్నపేట మండలంలో గత 20 రోజులుగా యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, యూరియా సప్లై పై సమగ్ర విచారణ నిర్వహించాలని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలో యూరియా కొరతను నివారించకుంటే సిపిఎం ఆధ్వర్యంలో రైతాంగాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు.