26-08-2025 12:23:41 AM
వెల్లడించిన గజల్ శ్రీనివాస్
హైదరాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్తు విశాఖ మ్యూజిక్, డ్యాన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు, అమరావతిలో నందమూరి తారక రామారావు వేదికపై జరుగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు సన్నాహాల్లో భాగంగా ఈ నెల 31న “ఉత్తరాంధ్ర సాహితీ, సాంస్కృతిక వేడుకలు” కళా భారతి, విశాఖపట్నంలో జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.
పంతుల రమ శాస్త్రీయ సంగీతం, గురు సహాస్రావధాని డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద్ అష్టావధానం, ఉత్తరాంధ్ర కవులచే కవి సమ్మేళనం, జేజి నారాయణ భక్త మార్కండేయ హరికథ, సందీప్ బృందంచే శ్రీనివాస కళ్యాణం నృత్య రూపకం, జానపద నృత్యాలు, సన్నిధి రాజ్ సాగి బృందంచే కూచిపూడి నృత్యాలు ఉంటాయన్నారు.
కేవలం మహిళలు మాత్రమే ప్రదర్శించే విజయనగం విజయ సూర్య సంస్థ సమర్పణలో “ తన దాకా వస్తే సాంఘిక లఘు నాటిక, శ్రీకాకుళం కళాకారులచే పౌరాణిక ఏక పాత్రభినయ ప్రదర్శనలు, వైజాగ్ బీట్స్ కరోకె గాయకులచే చలన చిత్ర గీతాలాపన , కళాకారులకు కవులకు సత్కారాలు ఉంటాయని చెప్పారు. కాగా గజల్ శ్రీనివాస్ తెలుగు గజల్, భక్తి గీతాల ఆలపన చేయనున్నట్టు పరిషత్తు కార్యదర్శి రెడ్డప్ప ధవేజి, మహా సభల ముఖ్య సమన్వయ కర్త పి.రామచంద్ర రాజు, కార్యక్రమం సంచాలకులు కోడూరి సుశీల తెలిపారు.