calender_icon.png 17 February, 2026 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్దుబాటుతోనే ఖాళీల భర్తీ!

17-02-2026 01:51:12 AM

  1. టీచర్ల నియామక ప్రక్రియ ఈ ఏడాది లేనట్టే..
  2. డీఎస్సీ వేసే ఆలోచనలో లేని అధికారులు

హైదరాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): టీచర్ల నియామక ప్రక్రియ ఇప్ప ట్లో లేనట్టే!. అధికారులు కూడా ఇదే స్పష్టం చేస్తున్నారు. ఇప్పట్లో టీచర్ల పోస్టు లు భర్తీ చేసే అవకాశం లేదంటున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా.. ఉండాల్సిన దానికంటే అదనంగా ఉపాధ్యాయులున్నారని అధికారులు అంటు న్నారు. కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టకుండా.. పాఠశాలల్లో అవసరమున్న చోట..

ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలనే ఆలోచనలో పాఠశాల విద్యాశాఖ ఉంది. ఉన్న పోస్టులనే సర్దుబాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోట టీచర్లు తక్కువగా ఉన్నారని, టీచర్లు ఎక్కువగా ఉన్నచోట విద్యార్థుల సంఖ్య తక్కువ గా ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు నివేదించారు.

కొత్తగా టీచర్ల నియామక ప్రక్రియ చేపట్టకుండానే టీచర్లు లేని చోట సర్దుబాటుతో ఈ సమస్యను అధిగమించాలని అనుకుంటున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఏర్పా టైన కొత్తలోనే 10 వేలకుపైగా పోస్టులతో నోటిఫికేషన్ జారీచేసి భర్తీ చేయడంతో మరో కొత్త నోటిఫికేషన్ గురించి ప్రభుత్వాన్ని అధికారులు అడగలేదని, ఇప్పట్లో అవసరం కూడా లేదని చెప్పినట్లు తెలిసింది. రాష్ర్టంలో 24,235 సర్కారు బడు లుంటే వీటిల్లో 16,57,812 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే 1,25,583 పోస్టులకు గానూ 1,06,566 మంది మాత్రమే టీచర్లున్నారు.

ప్రతి నెలా రిటైర్డ్ అవుతున్నవారి లెక్క వేరే. అధికారులు చెబుతున్నది ఏంటంటే విద్యాహక్కు చట్టం ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అయితే రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా నియామకాలు చేసిన తర్వాత ప్రస్తుతం విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి 1:14గా ఉందని అంటే 14 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారంటున్నారు. ప్రాథమిక స్థాయిలో సరిపడా టీచర్లున్నారని చెబుతున్నారు.

ప్రైమరీ స్కూళ్లలో 17 మందికి ఒక రు, ప్రాథమికోన్నత బడుల్లో 13 మందికి ఒకరు, హైస్కూళ్లలో 14 మందికి ఒకరు చొప్పున టీచర్లు ఉన్నారని విద్యాశాఖ చెబుతోంది. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రకారం చూస్తే ప్రైవేట్ కంటే కూడా సర్కారు బడుల్లోనే ఎక్కువ మంది టీచర్లున్నారని అంశాలను ప్రస్తావిస్తున్నారు. ప్రైవేట్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో 14 మందికి ఒకరుంటే ప్రభుత్వ బడుల్లో 13 మందికి ఒకరు, హైస్కూళ్లలో 21 మందికి ఒకరుంటే మన దగ్గర 14 మందికి ఒక టీచర్ ఉన్నారు.

కానీ, మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారి లెక్కల ప్రకారం 19 వేల వరకు ఖాళీలున్నాయి. వీటిని భర్తీ చేయకుండా క్రమబద్ధీకరించాలని చూస్తున్నారు. క్రమబద్ధీకరించడం ద్వారా 10 వేలకు పైగా టీచర్లు లేనిచోట సర్దుబాటు చేయాలనే ఆలోచణలో అధికారులున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి కూడా నివేదించారు. ఈ ప్రక్రియను జూన్ కల్లా పూర్తి చేయాలని అధికా రులు భావిస్తున్నారు.