calender_icon.png 16 October, 2025 | 10:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీడిన గంగమ్మ.. దర్శనమివ్వనున్న వనదుర్గమ్మ..

15-10-2025 04:27:35 PM

శుక్రవారం నుంచి వనదుర్గమ్మ దర్శనం పునరుద్ధరణ 

తగ్గిన మంజీరా ప్రవాహం 

ఆగస్టు 14 నుంచి సుమారు 2 నెలల తర్వాత అమ్మను దర్శించుకోనున్న భక్తులు

మధ్యలో రెండు రోజులు మాత్రమే దర్శనమిచ్చిన వనదుర్గమ్మ  

పాపన్నపేట (విజయక్రాంతి): దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. మంజీరా ఏడుపాయలుగా చీలి ప్రవహించే ప్రాంతం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి జలదిగ్బంధం వీడింది. సుమారు రెండు నెలలుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్న సంగతి విధితమే. భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదలడంతో వనదుర్గామాత ఆలయం సమీపంలో ఉన్న 30 శతకోటి ఘనపుటడుగుల వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లింది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ ఉధృతంగా దిగువకు ప్రవహించిన సంగతి తెలిసిందే. వనదుర్గామాత ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీపాయ ఉధృతంగా ప్రవహించడంతో అమ్మవారి ఆలయానికి భక్తుల రాకపోకలు స్తంభించాయి. దీంతో గత ఆగస్టు 14న అమ్మవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన విషయం విధితమే.

వనదుర్గమ్మ ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ప్రతిష్టించి భక్తులకు అమ్మ దర్శనం కల్పించారు. మధ్యలో 27 రోజుల తర్వాత నీటి ప్రవాహం తగ్గడంతో ఆలయంలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి అమ్మవారి దర్శనాన్ని పునః ప్రారంభించారు. కేవలం రెండు రోజులు మాత్రమే వన దుర్గమ్మ దర్శనం చేసుకోగా మళ్లీ మంజీరా ప్రవాహం పెరగడంతో ఆలయాన్ని మూసివేశారు. బుధవారం మంజీరా ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఆలయంలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని శుభ్రం చేస్తున్నారు. ఆలయ అధికారులు వరద ప్రవాహంతో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించారు. ఆలయాన్ని శుభ్రం చేయడానికి రెండు రోజుల సమయం పడుతుందని, శుక్రవారం నుంచి అమ్మవారి దర్శనం యధావిధిగా కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఆలయాన్ని శుభ్రం చేశాక విద్యుత్తు సదుపాయం తదితర ఏర్పాట్లు చేశాక అమ్మ దర్శనం కొనసాగించనున్నట్లు వారు పేర్కొన్నారు.