calender_icon.png 16 October, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నవారిపై కత్తితో దాడి

16-10-2025 08:40:42 AM

తల్లిదండ్రులకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం

​మణికొండ,విజయక్రాంతి: కన్న కొడుకే కాలయముడయ్యాడు. కని,పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులపైనే కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దారుణ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్(Narsingi Police Station) పరిధిలోని గండిపేటలో చోటుచేసుకుంది. ​పోలీసుల కథనం ప్రకారం.. గండిపేటలోని ఈఐపీఎల్ అపీలా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న రవీందర్ రెడ్డి, భారతి దంపతులపై వారి కుమారుడు రఘుపాల్ రెడ్డి బుధవారం అర్ధరాత్రి సమయంలో కత్తితో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో దంపతులిద్దరికీ తీవ్ర రక్తస్రావమైంది. వారి అరుపులు విన్న స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

​నిందితుడు రఘుపాల్ రెడ్డి నగరంలోని ఓ కళాశాలలో ఎల్ఎల్‌బీ చదువుతున్నాడు. గత కొంతకాలంగా అతను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. తన తల్లిదండ్రులు తనను మానసికంగా వేధిస్తున్నారని, మతిస్థిమితం సరిగ్గా లేదని చెప్పి వైద్యం చేయించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే దాడి చేశానని నిందితుడు పోలీసుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు రఘుపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.