calender_icon.png 20 October, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి జలదిగ్బంధంలో వనదుర్గమ్మ

20-10-2025 12:26:23 AM

  1. ఏడుపాయల్లో పెరిగిన గంగమ్మ ఉధృతి
  2. దర్శనాలు నిలిపివేసిన అధికారులు
  3. ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకుంటున్న భక్తులు

పాపన్నపేట, అక్టోబర్ 19 : వనదుర్గా ప్రాజెక్టు మరోసారి పొంగిపొర్లుతోంది. మంజీరా నదీ పాయలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మళ్లీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆగస్టు 14 నుంచి 62 రోజులుగా అమ్మవారి దర్శనం నిలిపివేసిన సంగతి తెలిసింది. శుక్రవారం దర్శనం పునః ప్రారంభించగా రెండు రోజులు మాత్రమే భక్తులు వనదుర్గమ్మను దర్శించుకున్నారు.

ఆదివారం మళ్లీ మంజీరా ప్రవాహం స్వల్పంగా ఉండడంతో అమ్మవారి దర్శనం నిలిపివేశారు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అమ్మ దర్శనం కల్పిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యధావిధిగా పున ప్రారంభిస్తామని ఆలయ అర్చకులు, అధికారులు పేర్కొన్నారు. నీటి ప్రవాహం వద్దకు భక్తులు ఎవరూ వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు.వరుస సెలవులు కావడంతో ఆదివారం ఏడుపాయల్లో భక్తుల రద్దీ పెరిగింది.

ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వనదుర్గమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బోనాలు, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి వన దుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడ మ్మా.. అంటూ వేడుకున్నారు. ఆలయ పరిసరాల్లోని పచ్చని చెట్లు, షెడ్లలో భోజనాలు చేసి సాయంత్రం ఇళ్లకు తిరుగుపయనమయ్యారు.