calender_icon.png 17 February, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమనీయం.. రమణీయం

17-02-2026 12:59:32 AM

వీరభద్రుడి కల్యాణ వేడుకలు

ఆధ్యాత్మిక శోభతో పులకించిన కురవి

తరలివచ్చిన వేలాది భక్తజనం

మహబూబాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవిలో ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక కాంతులతో విరాజిల్లింది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సోమవారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు నిర్వహించిన భద్రకాళి వీరభద్రుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశేషమైన లింగోద్భవ కాల అభిషేకాలను నిర్వహించారు. అనంతరం తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును మొదలుపెట్టారు. స్వామి వారు, అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి, వేదోక్తంగా వివాహ వేడుకను పూర్తి చేశారు. 

ముత్యాల తలంబ్రాల కోసం పోటీపడ్డ భక్తులు

భద్రకాళి వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ముత్యాల తలంబ్రాల వేడుక భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఓం నమః శివాయ అనే శంఖారావం మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. స్వామి వారి కల్యాణ వేడుకల అనంతరం తలంబ్రాలను అందుకోవడం భక్తులు మహాభాగ్యంగా భావిస్తారు. ఆ క్రమంలోనే కళ్యాణ వేడుకల అనంతరం తలంబ్రాల కోసం కళ్యాణ వేదిక వద్దకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని ముత్యాల తలంబ్రాలను పొందడానికి పోటీపడ్డారు.