11 May, 2026 | 3:40 AM

దీక్ష విరమించిన వీహెచ్

11-05-2026 01:49 AM

వయసురీత్యా పలువురి సూచన మేరకు విరమణ

నిమ్మరసం ఇచ్చిన ఎమ్మెల్సీలు కోదండరాం, మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల 

బీజేపీకి బీసీలంటే లెక్కలేదని మండిపాటు 

కేంద్రం బీసీ కులాల వారీగా లెక్క తేల్చాల్సిందేనని డిమాండ్

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): జనగణనలో ఓబీసీల కులగణన చేయాలనే డిమాండ్‌తో ప్రభుత్వ సలహాదారు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో గల తన నివా సంలో శనివారం ఉదయం చేపట్టిన అమరణ నిరాహార దీక్ష విరమించారు. వీహెచ్ వయసురీత్యా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉండటంతో డాక్టర్ల సూచనలు, బీసీ సంఘం నాయకులు, ప్రభుత్వంతో పాటు పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆదివారం రాత్రి దీక్ష విరమించారు.

టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు చిరంజీవలు, పూర్ణచందర్‌రావు తదితరులు వీహెచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా  కోదండరామ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం వీహెచ్ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. అన్యాయం ఎక్కడా జరిగినా ముందుగా స్పందించడమే కాకుండా సమస్యలున్న చోట వీహెచ్ ముందుండి పోరాటం చేస్తారని తెలిపారు.

ఓబీసీల గణన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని కోదండరామ్ తెలిపారు. మధుసూదనాచారి మాట్లాడుతూ బీసీల విషయంలో పట్టుదలతో ముందు వెళ్లేవారిలో వీహెచ్ ముందుంటారని కొనియాడారు. బీసీలకు న్యాయం జరగాలంటే కులాల వారీగా వారి జనాభా లెక్క కచ్చితంగా తేల్చాలన్నారు. బీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే నరేంద్రమోదీ బీసీల విషయంలో ఎందుకు వివక్ష పూపుతున్నారని ప్రశ్నించారు. బీసీల లెక్కలు ఇప్పుడు ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ తేలవని, అందుకు బీసీలు ఐక్యంగా ఉండి సాధించుకోవాలని పిలుపునిచ్చారు.  

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం : వీహెచ్

బీసీలకు న్యాయం జరిగే వరకు తన  పోరాటం కొనసాగుతుందని వీహెచ్ పేర్కొన్నారు. బీసీల విషయంలో బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరిస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు వీహెచ్‌కు సంఘీభావం తెలిపారు. సంఘీభావం తెలిపిన వారిలో పీసీసీ ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్, నాయకులు ఆర్. లక్ష్మణ్‌యాదవ్, యాదగిరి, శ్రీకాంత్‌గౌడ్, ఆది అవినాష్, శ్రీనివాస్‌రెడ్డితో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.