11-10-2025 12:44:40 AM
దాడి చేసి 24 గంటలైనా అరెస్టు చేయరా..
పోలీసులను నిలదీసిన బాధిత మహిళలు
పటాన్‌చెరు: మాయమాటలు చెప్పి మహిళల నుండి సుమారు రూ.20 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి తిరిగి డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు బాధిత మహిళలపై దాడి చేసిన ఘటనలో పోలీసులు ఉదాసీనత వ్యవహరిస్తున్నారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. పటాన్‌చెరు ఏపీఆర్ గ్రాండియాలో నివాసముంటున్న విద్య అనే మహిళ తక్కువ ధరకు బంగారం, విల్లాలు, ప్లాట్లు ఇప్పిస్తానని కోట్లాది రూపాయలు వసూలు చేసి బురిడీ కొట్టించిన విషయంలో పటాన్‌చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే డబ్బులు ఇస్తానని గురువారం తన ఇంటికి పిలిపించుకొని కుటుంబ సభ్యులతో దాడి చేయగా కలమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. తమపై దాడి చేసి 24 గంటలు గడుస్తున్నా పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడం ఏమిటని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులను నిలదీశారు. కిలాడీ లేడీకి పోలీసులు మద్దతునిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని బాధిత మహిళలు ఆరోపించారు. వెంటనే విద్యతో పాటు ఏడుగురిని అరెస్టు చేసి తమకు న్యాయం చేయకపోతే ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తామని హెచ్చరించారు.