వీధి వంచితులు!
- 23 సెలూన్లు కనుమరుగు
- పాన్ షాపులది అదే తీరు
కేసముద్రం, జూలై 2 (విజయక్రాంతి): అనేక సంవత్సరాలుగా కేసముద్రం మండల కేంద్రాన్ని ఆధారంగా చేసుకుని కులవృత్తిపై జీవిస్తున్న 23 మందికి చెందిన సెలూన్ షాపులు రోడ్డు విస్తరణలో తొలగించడంతో ‘వీధి’ వంచితులుగా మారిపోయారు. ఇంతకాలం తమ కుటుంబాలకు జీవనాధారం చూపిన రోడ్లే.. ఇప్పుడు తమకు నిలువ నీడ లేకుండా చేశాయని నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసముద్రం విలేజ్, కేసముద్రం స్టేషన్, దనసరి, సబ్ స్టేషన్ తండా, అమీనాపురం గ్రామాలను విలీనం చేసి కొత్తగా కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. గ్రామం నుండి పట్టణంగా మారడమే.. వారికి ఇప్పుడు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేసముద్రం విలేజ్, కేసముద్రం స్టేషన్ గ్రామాల పరిధిలో అనేక సంవత్సరాలుగా రోడ్ల వెంట ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో నాయి బ్రాహ్మణులు గుంచీలు, షెడ్లను ఏర్పాటు చేసుకొని వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు.
ఈ క్రమంలో కేసముద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవించడం, రోడ్ల విస్తరణ సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ తదితర పనులకు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం, ఆ వెంటనే పనులను ప్రారంభించడం జరిగింది. అయితే రోడ్ల వెంట పలుచోట్ల వివిధ వృత్తులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయం చూపకుండా, ఉన్నఫలంగా తొలగించడంతో అనేకమంది పేదలు ఉపాధి కోల్పోగా, ఇందులో నాయి బ్రాహ్మణ కుటుంబాలు వీధిన పడ్డాయని రోధిస్తున్నారు.
పాన్ షాప్ లది అదే తీరు.!
కేసముద్రం పట్టణంలో రోడ్ల విస్తరణలో తొలగింపులో పలుచోట్ల పాన్ షాపులు పెట్టుకొని జీవిస్తున్న అనేకమంది షాపులు కూడా తొలగింపుకు గురయ్యాయి. అంబేద్కర్ సెంటర్, మార్కెట్ ఏరియా, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంతాల్లో రెండు దశాబ్దాలకు పైగా వైన్ షాపులు పెట్టుకొని జీవనం సాగిస్తున్న పాతికమందికి చెందిన గుంచీలను ఇటీవల తొలగించారు. ఉన్నఫలంగా ప్రత్యామ్నాయం చూపకుండా షాపులను తొలగించడం వల్ల తమకు జీవనాధారం కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లనే నమ్ముకుని ఇంతకాలం కుటుంబాలను వెల్లదీస్తున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పన్ను చెల్లించినా ప్రత్యామ్నయం చూపలేదు
మార్కెట్ రోడ్డులో ప్రభుత్వ స్థలంలో పాతిక సంవత్సరాలుగా పాన్ షాప్ పెట్టుకొని జీవిస్తున్నాను. ఇందుకోసం అప్పుడు పంచాయతీకి ప్రతి సంవత్సరం పన్ను చెల్లించాను. వీధి వ్యాపారులకు మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి ప్రత్యామ్నాయ అవకాశాలు చూపించకుండా, ఉన్నఫలంగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా 40 అడుగుల చొప్పున విస్తీర్ణం లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పి, 50 అడుగులకు పైగా తొలగించడం జరిగింది. దీనితో ఇప్పుడు ఉపాధి కోల్పోయి కుటుంబ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇతర మున్సిపాలిటీలో వీధి వ్యాపారులకు ఉపాధి చూపినట్లుగానే ఇక్కడ కూడా చూపించి ఆదుకోవాలి.
- మందుల శ్రీనివాస్, పాన్ షాప్ యజమాని






