12-01-2026 08:50:46 PM
చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి
చేగుంట,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలు, ఇతర ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో ఇళ్లలో దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. పండుగ సెలవుల్లో ఇళ్లు ఖాళీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లే వారు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, విలువైన నగలు, నగదును ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచాలని సూచించారు.
అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా చలనం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పండుగను దృష్టిలో ఉంచుకుని పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పెట్రోలింగ్‌ను పెంచినట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తే దొంగతనాలను సమర్థవంతంగా నివారించవచ్చని ఎస్ ఐ ఆశాభావం వ్యక్తం చేశారు, మండలం లో ఎవరైనా అక్రమంగా చైనా మాంజ విక్రయించిన, అమ్మిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు,